ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భలే ఛాన్స్ చిక్కిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరో రెం డు రోజుల్లో ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్లలో షర్మిల ఎక్కడా నిర్వహించలేదు.
కేవలం తన తండ్రి సమాధి వద్దకు వచ్చి.. ప్రత్యేక ప్రార్థనలు చేసి.. వెనుదిరిగారు. గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉండడంతో సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
అయితే.. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయంలో మునిగిపోయింది. ఇంకా ఆ ఓటమి నుంచి పార్టీ నాయకులు ఎవరూ కూడా బయటకు రాలేదు. పార్టీ అధినేత జగన్ కూడా.. ఓటమి ఆవేదనను ఇంకా జీర్ణించుకోలేక పోయారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరఫున వైఎస్ జయంతిని నిర్వహించి నా.. నాయకులు పాల్గొనే అవకాశం తక్కువగానే ఉంటుంది. దీంతో ఆయా కార్యక్రమాలు అభాసుపాలవు తాయని జగన్ అంచనా వేసుకున్నట్టు తెలుస్తోంది.
దీంతో వైఎస్ జగన్.. తన సొంత నియోజకవర్గం పులివెందులకే పరిమితం కానున్నారు. జూలై 8న కేవలం ఇడుపుల పాయ సమాధి వరకే ఆయన పరిమితం కానున్నారు. అంటే.. గతంలో షర్మిల చేసినట్టు ప్రత్యేక ప్రార్థనల వరకు పరిమితమై.. అక్కడే ఉండిపోతారు.
రాష్ట్రంలో ఎవరి ఇష్టం వారిదే అన్నట్టు జగన్ వదిల శారు. పార్టీ పరంగా అట్టహాసంగా అయితే.. ఎలాంటి కార్యక్రమాలూ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇదిలావుంటే..ఇక్కడే షర్మిలకు కీలక ఛాన్స్ లభించింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతిని వేడుకగా నిర్వహించాలని షర్మిల నిర్ణయించారు. అయితే.. వైసీపీ ఎలాంటి అడుగులు వేస్తుందనే విషయంపై ఆమె ఆచితూచి వ్యవహరించారు. కానీ, ఇప్పుడు వైసీపీ చేతులు ఎత్తేయడంతో షర్మిల తన వ్యూహం ప్రకారం ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది.
తద్వారా.. విజయవాడలోనే కాకుండా విశాఖ, రాజమండ్రి, గుంటూరుల్లోనూ వైఎస్ జయంతిని కాంగ్రెస్ ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తానే నిజమైన వారసురాలినని ప్రకటించుకునే అవకాశం షర్మిల దక్కించుకున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.