ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. తాజాగా అటవీ సంపదపై సమీక్షించారు. ఈ సమీక్షకు అటవీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలకమైన ఎర్ర చందనం అక్రమ రవాణా పై పవన్ ఆరా తీశారు.
ఎర్ర చందనం దొంగిలించడం.. దుంగలను దాచడం.. రవాణా.. ఏయే దేశాలకు అమ్ముతున్నారు? వంటి అనేక ప్రశ్నలు సంధించారు. వాటి వివరాలు కూడా తెలుసుకున్నారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 158 దుంగలు దొరికాయని.. వీటి విలువ 1.6 కోట్ల వరకు ఉంటుందనిఅధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి కొందరు బాధ్యులను కూడా అరెస్టు చేశామన్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చిన్నవాళ్లు.. కూలీలు, లారీ డ్రైవర్లు.. క్లీనర్లు పట్టుకున్నట్టు చెబుతు న్నారు. కానీ, ఇది కాదు మనకు కావాల్సింది. అసలు వీటిని తరలిస్తున్న పెద్ద తలకాయలు కావాలి. ముందు వాళ్లను పట్టుకోం డి. వాళ్లను కట్టడి చేస్తే.. సమస్యలను పరిష్కరించడం తేలిక అవుతుంది” అని వెల్లడించారు.
దీంతో అధికారులు తమకు కొంత సమయం కావాలని కోరారు. అదేసమయంలో చైనా, నేపాల్ తదితర దేశాలకు తరలిపోయిన.. దుంగలపైనా నిఘా పెట్టాలని.. అవసరమైతే.. వాటిని వెనక్కి తెచ్చే మార్గాలను కూడా అన్వేషించాలని పవన్ కోరారు.
ఎవరీ పెద్ద తలకాయలు?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పెద్ద తలకాయలను పట్టుకోవాలని సూచించడంతో అధికారుల మధ్య చర్చప్రారంభమైంది. ఎవరీ పెద్దతలకాయలు అనేది వారికి తెలుసుననేది ప్రభుత్వ వర్గాల మాట. కొన్ని దశాబ్దాలుగా.. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు.. ఈ అక్రమ రవాణాలో పాతుకు పోయారు.
వీరిలో వైసీపీకి చెందిన బలమైన నాయకులు కూడా ఉన్నారని.. గతంలో పవనే ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు కూడా గతంలో వెల్లడించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి కీలక నాయకులు ఈ తతంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అప్పట్లో టీడీపీ నాయకులు బాహాటంగానే విమర్శించారు.
అయినప్పటికీ.. ఎవరిపైనా గతంలో చర్యలు కానీ.. విచారణ కానీ జరగలేదు. వీరితోపాటు.. బెంగళూరుకు చెందిన మరొకొందరు నాయకులు కూడా ఉన్నారనే సందేహాలు ఉన్నాయి. స్మగ్లింగుకు సంబందించి అంతర్జాతీయ ముఠాతో వీరికి సంబంధాలు ఉన్నాయని తరచుగా వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పవన్ పెద్దతలకాయల ప్రస్తావనను తీసుకువచ్చారని అంటున్నారు. మరి ఈ విషయంలో అధికారులు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు అధికారులకు తెలియదని కాదు.. తెలిసినా.. రాజకీయ ప్రయోజనాలు వారిని కట్టడి చేశాయి. ఇప్పుడు ఆ కట్టడి నుంచి ఏమేరకు బయట పడతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates