ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. చంద్ర‌బాబుపై నింగినంటిన అభిమానం!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చాలా ఏళ్ల త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. 2014లో ఆయ‌న అప్ప‌టి విభ‌జిత ఏపీ ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాత‌.. ఒక‌సారి, 2015లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎల్ బీ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు మ‌లి సారి ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. త‌ర్వాత‌.. అప్ప‌టి సీఎం కేసీఆర్ తో విభేదాలు.. ఓటు కు నోటు కేసు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. త‌దిత‌ర అంశాల‌తో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు పార్టీ నాయ‌కులే జంకాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎవ‌రైనా చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికితే..వారిపై కేసులు న‌మోదైన చ‌రిత్ర కూడా క‌నిపించింది.

అయితే.. తాజాగా ప‌దేళ్ల‌కు చంద్ర‌బాబుకు మ‌రోసారి హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఏపీకి రెండోసారి(వ్య‌క్తిగ‌తంగా నాలుగోసారి ముఖ్య‌మంత్రి) సీఎం అయిన‌.. చంద్ర‌బాబు తొలిసారి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబా ద్‌కు వ‌చ్చారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని.. ఆయ‌న నేరుగా శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో బేగంపేట లోని విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డ నుంచి జూబ్లీ హిల్స్‌లోని చంద్ర‌బాబు నివాసం వ‌ర‌కు.. పార్టీ అభిమానులు, కార్య‌కర్త‌ల‌కు, ఐటీ ఉద్యోగులు.. వేలాది గా పాల్గొని సంబ‌రాల న‌డుమ చంద్ర‌బాబును జూబ్లీ హిల్స్ వ‌ర‌కు తీసుకువెళ్లారు.

ఓపెన్ టాప్ వాహ‌నంలో నిల‌బ‌డిన చంద్ర‌బాబు అంద‌రికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బేగం పేట నుంచి జూబ్లీ హిల్స్ వ‌ర‌కు ఇసుక వేస్తే.. రాల‌నంత‌గా అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. జై చంద్ర‌బాబు, జై టీడీపీ నినాదాల‌తో బేగంపేట‌ హోరెత్తిపోయిం ది. నిత్యం వాహ‌నాల ర‌ద్దీతో ఉండే ఈ ప్రాంతం ఎటు చూసినా..ప‌సుపు వ‌ర్ణంతో నిండిపోయి.. అభిమానుల ఆనందంతో క‌ళ‌క‌ళ‌లా డింది. కాగా, చంద్ర‌బాబు స్వాగ‌త యాత్ర‌కు రేవంత్ స‌ర్కారు ఒక రోజు ముందు ప‌ర్మిష‌న్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో పోలీసులు బేగం పేట నుంచి జూబ్లీ హిల్స్ వ‌ర‌కు ట్రాఫిక్‌ను దారి మ‌ళ్లించారు. అదేవిధంగా భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను ఏర్పాటు చేసి భ‌ద్ర‌త క‌ల్పించారు. ఏదేమైనా.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. ల‌భించిన ఈ ఘ‌న స్వాగ‌తంతో చంద్ర‌బాబు ఉబ్బిత బ్బిబ్బ‌య్యారు. కాగా, శ‌నివారం.. ఏపీ, తెలంగాణ సీఎంలు రెండు రాష్ట్రాల విబ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ భేటీ ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నుంది. ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఈ భేటీలో పాల్గొన‌నున్నారు.