151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన ఐదేళ్లకు కేవలం 11 సీట్లకు పడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతటి ఘనవిజయం తర్వాత ఇంతటి ఘోర ఓటమికి ఎందుకు ఎదురైంది అని వైసీపీ ఆత్మావలోకనం చేసుకుంటుందని.. పొరబాట్లు దిద్దుకుని ముందుకు సాగుతుందని అనుకుంటాం.
ముఖ్యంగా ఈ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే అని.. ముందు ఆయనే మారాలని స్వయంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. కానీ ఓటమి తర్వాత నెల రోజులు గడుస్తున్నా జగన్‌లో ఎంతమాత్రం మార్పు కనిపించడం లేదు.
ఇప్పటికీ తాను అద్భుతంగా పాలించానని.. అయినా జనం తనను ఓడించారనే అభిప్రాయంలోనే ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఓడిన తనకే జనాల్లో తనకే ఆదరణ ఉందని, గెలిచిన చంద్రబాబుకు లేదని ఆయన మాట్లాడుతుండడం విడ్డూరం.
ఎన్నికల ఫలితాల అనంతరం ఒకసారి మీడియాతో మాట్లాడి, ఆపై మళ్లీ కనిపించని జగన్.. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో జైల్లో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి చాలా మంచి వాడని.. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని జగన్ వ్యాఖ్యానించారు. పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టడంపై స్పందిస్తూ.. అన్యాయం జరిగింది కాబట్టే ఈవీఎంలు పగలగొట్టాడని.. దాన్ని కోర్టు కూడా అంగీకరిస్తూ ఆయనకు బెయిల్ ఇచ్చిందని జగన్ పేర్కొనడం విశేషం. ఇక ఎన్నికల ఫలితాల గురించి జగన్ మాట్లాడుతూ..
‘‘జనం ఎందుకు నీకు ఓటేశారు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో ఇదై ఒక పది శాతం కాస్తా అటు షిఫ్ట్ అయి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన పరిస్థితి’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల్ని చూస్తే జగన్ ఏమీ మారలేదని.. ఇంకా తాను గొప్పగానే పాలించాననే భ్రమలో ఉన్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా.. చివర్లో మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తుంటే పట్టించుకోకుండా తన దగ్గరున్న స్క్రిప్టు పేపర్లు మడత పెట్టుకుని జగన్ వెళ్లిపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates