విజయవాడకు చెందిన యువ నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు.. రాధా తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. అయితే.. ఈవ్యాఖ్యల వెనుక రీజనేంటి? మీనింగేంటనేది అంతుచిక్కడం లేదు. గురువారం రంగా 77వ జయంతి. దీనిని పురస్కరించుకుని విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతు.. పదవుల కోసం..ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదన్నారు. ఏ పదవులు, హోదాలు ఆశించలేదని చెప్పారు.
తనవంతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానని.. పదవులు ఆశించి మాత్రం కాదన్నారు. కాబట్టి తన అభిమానులు ఓవర్‌గా ఆలోచించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల కోసం.. పనిచేయడమే లక్ష్యంగా గతంలో రంగా ముందుకు సాగారని.. ఆయన చూపిన బాటలోనే తాను కూడా నడుస్తున్నానని తెలిపారు. పదువులు ఆశించలేదు. ఆశించను కూడా. ఈ విషయాన్ని రంగా అభిమానులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరూ ఓవర్‌గా ఆలోచించవద్దని.. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోదద్దని తెలిపారు.
ఇక, తాజాగా జరిగిన ఎన్నికలను ప్రస్తావిస్తూ.. ప్రజలు తమను నిర్లక్ష్యం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నికలు.. తమను పట్టించుకోని వారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారని.. నాయకులు ప్రజల విషయంలో ఎలాంటి బాధ్యతగా వ్యవహరించాలో కూడా.. ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. అందుకే ఇంత భారీ సంఖ్యలో కూటమికి సీట్లు వచ్చాయని రాధా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అయితే.. రాధా వ్యాఖ్యల అంతరార్థం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కలేదు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా.. ఎన్నికల సమయంలో అటు జనసేనకు, ఇటు టీడీపీకి కూడా ప్రచారం చేశారు. అయితే.. ఆయన టికెట్ ఆశించారా? లేకఆశించలేదా? అనేది ఒక ప్రశ్న అయితే.. చంద్రబాబు ఈవిషయాన్ని పట్టించుకున్నారా? లేదా? అనేది చింత. మొత్తానికి ఎన్నికల సమరంలోకి రాధా దిగలేదు. పోనీ.. ఆయన గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు టీడీపీలోనే ఉన్నా.. సరైన గుర్తింపు రాలేదు. పార్టీ పదవులు ఇవ్వలేదు. నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే రాధా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆయన అంతరంగం ఏంటనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates