వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని.. తాను ఎవరినీ బ్రతిమాలబోనని స్పష్టం చేశారు. “చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్లను వెళ్లమనే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు.. అక్కడొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా నేను ఆపను. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఆయన నెల్లూరులో పర్యటిస్తున్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించేందుకు నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు ఆయనను కలిశారు. ఈ సమయంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. చాలా మంది నాయకులు టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని ఆయనకు చెప్పారు. ముఖ్యంగా వీరిలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. “మీరేం బాధ పడొద్దబ్బా. ఎవరున్నా.. ఎవరు లేకపోయినా.. ప్రజలు మనతో ఉన్నారు. పార్టీ ఉంటుంది. వెళ్లేవాళ్లను వెళ్లనివ్వడం. మీరు కూడా అడ్డుపడొద్దు. ఎవరినీ బ్రతిమాలొద్దు” అని తేల్చి చెప్పారు. అనంతరం ఆయన నేరుగా నెల్లూరు జైలుకు వెళ్లారు. ఇదిలావుంటే. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మెుత్తం 11 మంది వైసీపీ, కొందరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు(ఆమంచి కృష్ణ మోహన్ వర్గం) ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందేంచేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షణీయమన్నారు.