‘జ‌గ‌న్ మ‌న‌స్తత్వం చాలా డిఫ‌రెంట్‌.. అర్థంకాదు’

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌న‌స్థ‌త్వం చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని.. దానిని అర్ధం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌.. ఆరా అధినేత మ‌స్తాన్ పేర్కొన్నారు. జ‌గ‌న్ ఎవ‌రినీ బ్ర‌తిమాల‌ర‌ని.. ఎవ‌రూ త‌న‌కు అనుకూలంగా ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తిత్వం ఆయ‌న‌కు లేద‌న్నారు. ఆయ‌న మ‌న‌స్థ‌త్వం చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుందన్నారు. ఆయ‌న‌ను అర్థం చేసుకోవ‌డం కూడా.. అంతే డిఫ‌రెంట్ అని తెలిపారు. లేక‌పోతే.. ఎన్నిక‌ల‌కు ముందు ఇంత మంది ఎలా వెళ్లిపోతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత‌.. ఆరా మ‌స్తాన్ వెలుగులోకి వ‌చ్చారు. అప్ప‌టి వ‌ర‌కు స‌ర్వేలన్నీ.. ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌న్న విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న స‌మ‌యంలో ఆరా మ‌స్తాన్ మాత్రం.. వైసీపీకి 100-110 స్థానాల్లో విజ‌యం వ‌రిస్తుంద‌ని.. కావాలంటే.. రాసిపెట్టుకోండ‌ని కూడా ప‌లు చానెళ్ల‌లో చెప్పుకొచ్చారు. తాము ఎలా స‌ర్వే చేసింది కూడా ఆయ‌న చెప్పారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిని కూడా లెక్కించామ‌న్నారు. అయినా.. జ‌గ‌నే గెలుస్తున్న‌ట్టు చెప్పారు.

కానీ అనూహ్యంగా కూట‌మి ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో మ‌స్తాన్ తెర‌మ‌రుగ‌య్యారు. దాదాపు నెల రోజుల త‌ర్వాత‌.. ఆయ‌న ఓ ఆన్‌లైన్ చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాము ఎగ్జిట్ పోల్ సర్వేను స్వ‌తంత్రంగానే వెల్ల‌డించామ‌న్నారు. త‌మ‌పై జ‌గ‌న్ కానీ, వైసీపీ నాయ‌కులు కానీ, ఎలాంటి ఒత్తిడీ చేయ‌లేద‌న్నారు. ఎవ‌రో త‌మ‌పై ఒత్తిడి చేస్తే.. ఇలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌ని తాము చెప్పేవారం కామ‌న్నారు. పైగా జ‌గ‌న్‌కు ఎవ‌రినీ బ్ర‌తిమాలే మ‌న‌స్థ‌త్వం లేద‌న్నారు.

నాకు అనుకూలంగా ఉండండి. నాకు అనుకూలంగా వార్త‌లు రాయండి.. అని జ‌గ‌న్ ఎవ‌రికీ చెప్ప‌రు. స‌ర్వే సంస్థ‌ల‌ను కూడా ఆయ‌న అడ‌గ‌లేదు. నిజానికి ఆయ‌న‌కు ఇలాంటి మ‌న‌స్థ‌త్వం ఉంటే.. పార్టీ నుంచి ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క నేత‌లు జారి పోతుంటే.. వారిని పిలిచి మాట్లాడి.. స‌ర్దిచెప్పేవారు కదా! త‌న‌కు అనుకూలంగా ఉండ‌మ‌ని అనేవారు క‌దా!. కానీ, జ‌గ‌న్ మ‌న‌స్థ‌త్వం అలాంటిది కాదు అని మ‌స్తాన్ వెల్ల‌డించారు. అంతేకాదు.. అస‌లు జ‌గ‌న్‌ను అర్ధం చేసుకోవ‌డం కూడా క‌ష్ట‌మేన‌న్నారు.