గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్.. బయటకు వచ్చింది లేదు. ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల సమయంలో ఆయన బయటకు వచ్చారు. అది కూడా … పరదాలు కట్టుకుని.. చెట్లు కొట్టేయించుకుని ప్రజల మధ్యకు భయం భయం గా వచ్చారనే విమర్శలు ప్రతిపక్షం నుంచి జోరుగా వినిపించాయి. ఆ తర్వాత.. మళ్లీ ఆయన ప్రజల మధ్యకు వచ్చింది.. ఎన్నికల సమయంలోనే .
అయితే.. ఇప్పుడు ఓటమి భారం వెంటాడుతోంది. దాదాపు ఫలితం వచ్చి నెల రోజులు గడిచిపోతున్నా.. జగన్ ఇప్పటి వరకు .. ఆ ఓటమి భారం నుంచి కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. పైగా.. ఆయన నాయకులను కూడా సర్ది చెప్పలేకపోతున్నారు. పోయే వాళ్లు పోనీ అన్నట్టుగానే వదిలేశారు. అయితే.. ఇప్పటి వరకు టీడీపీ కానీ, జనసేన కానీ.. గేట్లు తెరవలేదు కాబట్టి.. జంపింగులు చోటు చేసుకోలేదు. కానీ, వాళ్లు గేట్లు తెరిస్తే.. ఇబ్బందులు ముసురుకోవడం ఖాయం.
మరోవైపు.. జగన్ ఇప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. అధికార పక్షం పూర్తి స్వింగ్‌లో ఉంది. భారీ మెజారిటీ దక్కించుకుని గజ్జెల గుర్రంలా పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ముందు.. వైసీపీ సర్కారును బూచిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కామనే. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కొలువుదీరిన.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా.. కేసీఆర్ తప్పులనే ముందుగా ప్రజలకు వివరించింది. శ్వేత పత్రాలు కూడా విడుదల చేసింది.
ఇక, ఇప్పుడు ఏపీలోనూ పోలవరం శ్వేత పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అదే విధంగా ఇతర శాఖలపైనా ఆయన దృష్టి పెట్టారు. శ్వేత పత్రాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అదేసమయంలో అమరావతిని వైసీపీ ధ్వంసం చేసిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన శ్వేత పత్రాన్ని కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. ఇలా చూసుకుంటే.. వైసీపీ పాలనకు ఇది భారీ డ్యామేజీ తీసుకువస్తుంది. ఈ సమయంలో అయినా.. జగన్ వచ్చి.. నిజాలు ఏంటో.. తమ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాలి. కేవలం అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటివారిని రంగంలోకి దింపి చేతులు తుడుచుకుంటే.. మున్ముందు పార్టీకి మరింత ఇబ్బంది ఖాయమని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.