రాహుల్ గాంధీ హీరో అయిపోయాడుగా..

లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా రాహుల్ గాంధీ చాలాసార్లు అవ‌మానాలే ఎదుర్కొన్నాడు. ఆయ‌న ప్ర‌సంగాల వీడియోలు గ‌తంలో చాలా వ‌ర‌కు ట్రోలింగ్‌కే ఉప‌యోగ‌ప‌డ్డాయి. స‌రిగా మాట్లాడ‌లేడ‌ని.. స‌బ్జెక్ట్ ఉండ‌ద‌ని భాజ‌పా వాళ్లు ఆయ‌న్ని ఎప్పుడూ ఎగ‌తాళి చేస్తుంటారు.

ఐతే ఏ నాయ‌కుడైనా కొన్నేళ్ల పాటు క‌ష్ట‌ప‌డితే ఎదుగుద‌ల ఉంటుంద‌ని.. స‌బ్జెక్ట్ పెంచుకోవ‌డానికి ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం ఉంటుంద‌ని.. జ‌నాల్లో తిరిగితే ఆద‌ర‌ణ దానికంత‌ట అదే వ‌స్తుంద‌ని రాహుల్ గాంధీ విష‌యంలోనూ రుజువ‌వుతోంది.

గ‌త కొన్నేళ్ల‌లో రాహుల్ రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంతో ఎదిగాడ‌న్న‌ది స్ప‌ష్టం. ఆయ‌న ప్ర‌సంగాలు కూడా ఇప్పుడు బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. గ‌తంలో లోక్‌స‌భ‌లో మోడీని ఎదుర్కోలేక ఢీలా ప‌డ్డ రాహుల్.. ఇప్పుడు మోడీతో పాటు భాజ‌పా స‌భ్యులంద‌రినీ ఇరుకున పెట్టి డిఫెన్స్‌లోకి నెట్టేస్తున్నాడు.

సోమ‌వారం లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ ప్ర‌సంగం చూస్తే బీజేపీ ఎంత డిఫెన్స్‌లో ప‌డిందో అర్థ‌మ‌వుతుంది. మోడీనే కాక ఆ పార్టీ త‌ర‌ఫున కొత్త స్పీక‌ర్‌గా నియ‌మితుడైన ఓం బిర్లాను కూడా ఉక్కిరిబిక్కిరి చేసేశాడు రాహుల్ గాంధీ.

ఓం బిర్లా స‌భాప‌తిగా నియ‌మితుడైన‌పుడు.. త‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన‌పుడు నిటారుగా నిల‌బ‌డ్డార‌ని.. కానీ మోడీ వ‌స్తే మాత్రం వంగి వంగి దండాలెట్టార‌ని హావ‌భావాల‌తో రాహుల్ గాంధీ చూపించిన‌పుడు స‌భ హోరెత్తింది.

ఇక బీజేపీని యాంటీ హిందుగా రాహుల్ అభివ‌ర్ణించ‌గానే.. మోడీ లేచి హిందువుల‌ను రాహుల్ అవ‌మానిస్తున్నాడ‌ని పేర్కొన‌గా.. బీజేపీ హిందుత్వానికి పేటెంట్ తీసుకోలేదంటూ ఘాటుగా స్పందించాడు రాహుల్. దీంతో మోడీ సైలెంట్ అయిపోవాల్సి వ‌చ్చింది.

మ‌రోవైపు శివుడి ఫొటో తెచ్చి త‌న వెనుక ఉన్న బ‌లం ఆయ‌నే అని రాహుల్ చెబుతుండ‌గా.. కెమెరా రాహుల్ మీది నుంచి ఔట్ ఆఫ్ ఫోక‌స్ అయిపోవ‌డంతో ఆ విష‌యాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేస్తూ స‌భ‌ను ఎన్డీయే ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న తీరును రాహుల్ దుయ్య‌బ‌ట్టాడు. మొత్తంగా సోమ‌వారం నాటి త‌న ప్ర‌సంగం, చ‌ర్య‌ల‌తో రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయాడ‌నే చెప్పాలి.