జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజే 100% పెన్షన్ పంపిణీ లక్ష్యంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
గత ఐదేళ్లుగా పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని లోకేష్ అన్నారు. కానీ, అధికారుల సెట్ కావడానికి ఇంకా టైం పడుతుందేమో సార్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పరదాలు కట్టవద్దని చెప్పినా కొందరు అధికారులు వినడం లేదని, బ్రతిమిలాడి తీసి వేయించేస్తున్నామని లోకేష్ సరదాగా మాట్లాడారు. లోకేష్ వ్యాఖ్యలకు నవ్వుతూ చంద్రబాబు బదులిచ్చారు.
అధికారులు మారిపోయారని, ఒకవేళ ఎవరైనా ఇంకా మారకుండా పరదాలు కడితే కట్టిన వాళ్ళను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని చంద్రబాబు అన్నారు. అటువంటివి తాను వినదల్చుకోలేదని, ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోయి కొత్త రోజులను జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు సాగాలని అధికారులకు చంద్రబాబు చెప్పారు.
కొత్త కల్చర్ కు మంత్రులు, అధికారులు అందరూ అలవాటు పడాలనిని అన్నారు. రివర్స్ పోయిన బండిని పాజిటివ్ గా ముందుకు నడిపిస్తున్నామని, ఇంకా స్పీడు పెంచాలి తప్ప వెనక్కి పోకూడదని చంద్రబాబు అన్నారు.ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని, ఇచ్చేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రభుత్వంలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.
1995లో హైదరాబాద్ నుంచి తాను బయలుదేరుతున్నాను అంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అప్పట్లో నువ్వు కూడా చిన్న పిల్లాడివి..అంటూ లోకేష్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇప్పుడు అలా లేదు కానీ…తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టబోనని చంద్రబాబు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.