పరదాల ముఖ్యమంత్రి అంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పై గత ప్రభుత్వంలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం తిరుమల పర్యటన సందర్భంగా జగన్ పరదాలపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పరదాలు కట్టొద్దన్నా కడుతున్నారేంటి అని అధికారులను అడిగితే…అలవాటులో పొరపాటు అని అధికారులు సమాధానమిచ్చారు. ఇక, తాజాగా ఏపీలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పరదాలపై మరోసారి జగన్ సెటైర్లు వేశారు.
ఈ సారి సీఎం చంద్రబాబుకు కూడా అధికారులపై లోకేష్ సున్నితమైన కంప్లయింట్ ఇచ్చారు. ఇంకా కొందరు అధికారులు మారలేదు సార్…పరదాలు కట్టొద్దని చెబుతున్నా వినడం లేదని…బ్రతిమిలాడి తీయిస్తున్నామని లోకేష్ అన్నారు. దీనికి చంద్రబాబుతోపాటు సభలో ఉన్న వారంతా నవ్వారు. ‘సార్.. సెట్ అయ్యేందుకు టైమ్ పడుతుంది అనుకుంటా.?’ అని లోకేష్ అనగానే.. ‘లేదు సెట్ అయ్యారు’ అని సీఎం చంద్రబాబు బదులిచ్చారు.
ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఆర్భాటాలు ఉండవని, మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ ప్రజలకు సేవకులుగానే ఉంటామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. అలా కాకుండా గత ప్రభుత్వం మాదిరిగా పెత్తందారులుగా ప్యాలెస్‌లో ఉండబోమని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ఘన విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుతం జగన్ పరదాలపై లోకేశ్, జగన్ ప్యాలెస్ పాలనపై చంద్రబాబు ర్యాగింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates