నితీష్‌కు వంత పాడిన మోడీ వీరాభిమాని!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు.. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌. ఈయ‌న ఒక‌ప్ప‌టి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఈయ‌న మోడీకి ద‌గ్గ‌ర‌య్యారు. మోడీ ఎంత చెబితే అంత అంటూ.. పార్ల‌మెంటు ఎన్నికల స‌మ‌యంలో చెల‌రేగి మాట్లాడారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన ఎల్ జేపీ పార్టీకి ఇప్పుడు ఈయ‌న చీఫ్‌గా ఉన్నారు. బిహార్‌లోని పార్ల‌మెంటు స్థానాల్లో 5 చోట్ల ఈయ‌న నియ‌మించిన స‌భ్యులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ కూట‌మి ఎన్డీయేకి ఐదుగురితో క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు.

ఇక‌, ఎల్ జీపీ అధినేత‌గా మోడీ కేబినెట్‌లో ఒక కేంద్ర మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు. దీంతో మోడీ హ్యాపీ అయ్యారు. కానీ, కేంద్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి నెల రోజులు కూడా కాక‌ముందే.. బిహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ .. త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ.. అసెంబ్లీలో తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. దీనిని గ‌వ‌ర్న‌ర్‌కు కూడా పంపించా రు. ఇదొక పెద్ద సంక‌టం. పైగా తేనెతుట్టెనే క‌దిపారు. అయితే.. ఇప్పుడు విధిలేని ప‌రిస్థితిలో కొంద‌రు మిత్రులు, శ‌త్రువులు కూడా నితీష్ వెంట న‌డ‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వీరిలో చిరాగ్ పాశ్వాన్ కూడా తోడ‌య్యారు.

మోడీకి ఎంత విధేయుడైన యువ నాయ‌కుడే అయినా..రాష్ట్ర ప‌రిస్థితిని, నితీష్ కుమార్ దూకుడును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఆయ‌న తాను కూడా ప్ర‌త్యేక హోదాకు గ‌ళం క‌లిపారు. వాస్త‌వానికి మోడీకి ఇష్టం ఉండ‌ద‌ని తెలిసినా.. రాష్ట్రం కోసం.. పార్టీ కోసం.. చిరాగ్‌.. నితీష్‌కు జైకొట్టారు. దీంతో ఇప్పుడు బిహార్‌కు ప్ర‌త్యేక హోదా అంశానికి.. మ‌రింత బ‌లం చేకూరింది. ప్ర‌స్తుతం అటు నితీష్‌కు ఉన్న 12 మంది ఎంపీలు, చిరాగ్‌కు ఉన్న ఐదుగురు ఎంపీలు.. క‌లిపి మోడీకి 17 మంది ఎంపీల మ‌ద్ద‌తు ఉంది. దీంతో వీరిని కాద‌నే ప‌రిస్థితి లేదు. అలాగ‌ని ముందుకు వెళ్తారా? అంటే.. అది కూడా ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

ఇత‌ర రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తే.. త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు అన్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌నే మోడీ అంత‌రంగం చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలోనే గ‌త ప‌దేళ్లుగా ఏపీ నుంచి అనేక మార్లు ప్ర‌త్యేక హోదా కోసం.. డిమాండ్లు వెళ్లినా.. ఆఖ‌రికి 2018లో చంద్ర‌బాబు ఎదురుతిరిగి క‌య్యం పెట్టుకున్నా.. మోడీ ప‌ట్టించుకోలేదు. అయితే.. అప్ప‌ట్లో బీజేపీకి బ‌లం ఉంది. కానీ, ఇప్పుడు ఆధార‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని ఆస‌రా చేసుకుని.. మిత్ర‌ప‌క్షాలు.. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా నితీష్ వంటి స్థిర‌త్వం లేని నాయ‌కుడితో మోడీకి సెగ త‌గులుతోంది. మొత్తానికి ఇప్పటి వ‌ర‌కు ఈ నెల రోజుల్లో మోడీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మున్ముందు రోజులు మాత్రం అంత ఈజీకాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా తోడైతే.. మోడీ దిగిరాక త‌ప్ప‌దు! మ‌రి ఏం చేస్తారో చూడాలి.