చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు ఇలా ఆన్స‌ర్ ఇస్తున్నారా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే నెల 1న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. అయితే.. ఈ పింఛ‌న్ల‌ను త‌న చేత్తోనే ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. 1వ తారీకున చంద్ర‌బాబు స్వ‌యంగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయనున్నారు అని ప్ర‌క‌ట‌న జారీ అయింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న పెనుమాక గ్రామంలో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు.

సీఎం పంపిణీ ప్రారంభించిన త‌ర్వాత‌.. రాష్ట్ర వ్యాప్తంగా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇలా.. ఒక ముఖ్య‌మంత్రి పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం.. త‌న చేతుల మీద‌నే పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌డం అనేది.. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే కాదు.. దేశ చ‌రిత్ర‌లోనూ తొలిసారి అవుతుంది. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇదేమ‌న్నా ప్ర‌చారానికి తెర‌దీస్తున్న కార్య‌క్ర‌మ‌మా? లేక‌.. ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం.. ద్వారా త‌న చేతుల మీద పంపిణీ చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు రెండు కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల నుంచి ఆశిస్తున్నారు. అందుకే స్వ‌యంగా పంపిణీ చేస్తున్నారు.

1) ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌నే ముద్ర‌: త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని.. ప్ర‌జ‌ల కోసం.. ఎంత దిగువ‌కైనా దిగివ‌స్తుంద‌ని.. చెప్ప‌డం ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది. కేవ‌లం ఉద్యోగుల‌ను పంపించి ఇవ్వ‌డం కాదు.. తానే స్వ‌యంగా ఇవ్వ‌డం ద్వారా అధికారుల్లోనూ బాధ్య‌తాయుత పరిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అలానే.. ప్ర‌జ‌ల్లోనూ ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్తుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. పింఛ‌న్ల పంపిణీలో పాల్గొన‌డం ద్వారా.. ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్షపాతి.. అనే వాద‌న‌ను ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌నున్నారు.

2) ప్ర‌చారం: సాధార‌ణంగా ల‌బ్ధిదారుల‌కు ప్ర‌తి నెలా 1వతేదీనే.. పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తారు. కానీ, ఈసారి మాత్రం ఒకే ద‌ఫా రూ.1000 పెంచి ఇస్తున్న నేప‌థ్యంలో దీనికి ప్ర‌చారం కోరుకోవ‌డం త‌ప్పుకాదు. పైగా.. రాష్ట్రం ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉన్నా.. ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్షాన నిలిచి.. ఎంత‌టి భార‌మైనా భ‌రించేందుకు సిద్ధంగా ఉంద‌నే అభిప్రాయాన్ని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌ను న్నారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను చంద్ర‌బాబు నిల‌బెట్టుకోడు.. అన్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు.. స‌మాధానంగా కూడా.. ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. మొత్తానికి తొలిసారి ఒక ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి.. పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.