పాత బస్తీకి టెండర్ పెట్టిన రేవంత్?

తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను నష్టాలను పూరించే క్రమంలో బలమైన ప్రైవేటు కంపెనీని దించుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా అదానీ గ్రూప్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

‘‘పాత బస్తీలో కరెంట్ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. వసూలు చేసేందుకు వెళ్లే కరెంట్‌ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. అందుకే ప్రయోగాత్మకంగా ఈ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థను ఆదానీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు’’ రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం దశలవారీగా హైదరాబాద్ నగరం, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆదానికి అప్పగిస్తామని వెల్లడించారు.

అదానీ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయంలో 75% రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 25% అదానీ గ్రూప్‌కు వెళ్తుందని, దీనిపై ఇప్పటికే అదానీ గ్రూప్‌తో చర్చించామని, వారు అంగీకరించారని, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని అదానీ గ్రూప్‌ను కోరినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సంధర్భంగా ‘‘కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అదానీకి అప్పగించడాన్ని రాహుల్‌ గాంధీ తప్పు పడుతున్నారని, అంతేతప్ప అదానీతో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలేదని’’ రేవంత్ చెప్పడం కొసమెరుపు.