తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు.. ఒకరికొకరు ఎదురు పడే సమయం వచ్చేసింది. ఒకరిపక్కన ఒకరు ముఖ్యమంత్రుల హోదాలో కూర్చునే పరిస్థితి కూడా వచ్చేసింది. నిజానికి ఇప్పటి వరకు వారిద్దరు ఎప్పుడెప్పుడు ఎదురు పడతారా? అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇబ్బందులు ఉండడం.. విభజన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండడం.. ప్రధానంగా జల సమస్య ఇరు రాష్ట్రాలను ఇరుకున పెట్టడం వంటి కారణంగా ఆయాన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలు గతంలో అన్యోన్యులే కాబట్టి.. వారు ఎప్పుడు ఎదురు పడతారా? ఆయా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అయితే.. ఇది రాజకీయ సమావేశం కాకపోవడం గమనార్హం. ఒక సామాజిక వర్గం పెట్టుకునే సమావేశం. దీనిలో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. వారిని పాల్గొనాలని కోరుతూ.. సదరు సామాజిక వర్గం కోరింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
ఇక, విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడుతున్న కమ్మ సామాజిక వర్గం.. జూలై 20, 21 తేదీల్లో మహాసభ పేరుతో హైదరాబాద్‌లో పెద్ద సభను నిర్వహించనుంది. ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభ.. ‘తొలి ప్రపంచ కమ్మ మహాసభ’గా నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. ఇలా.. ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలు పక్కన పక్కన కూర్చొని ఒకే కార్యక్రమంలో పాల్గొననున్నారు.