గౌరవంగా సాగనంపుతున్నారు !

వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల సమయంలో ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్నా వారి స్థానంలో తిరిగి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే పోస్టింగ్ కోసం సిఫారసు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి తప్పించి నూతనప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి జవహర్ రెడ్డి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యది కూడా అదే పరిస్థితి.

త్వరలో ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.