రాజకీయంగా విభిన్న ఆలోచనల నుంచి వచ్చి.. చేతులు కలిపిన నాయకులు ఎన్నాళ్లు అలా కలిసి ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఎవరి భావాలు వారివి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. అనేక మంది చేతులు కలుపుతారు.. అనేక మంది విడిపోతూ కూడా ఉంటారు. కానీ, పట్టుమని పదేళ్లయినా.. కలిసి ఉన్న పార్టీలు పెద్దగా మనకు కనిపించవు. కనిపిస్తే మంచిదే. కానీ, ఇప్పుడు ఏపీలో చేతులు కలిపి. అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన అధినేతల మధ్య కుదిరిన కెమిస్ట్రీ చూసిన తర్వాత.. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టాల్సి వస్తోంది.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు కలిసి ముందుకు సాగుతున్నారు. పదవులు పంచుకున్నారు. ఎక్కడా అసంతృప్తి లేకుండా.. పవన్.. ఎక్కడా అగౌరవ పరచకుండా చంద్రబాబుకూడా.. వ్యవహరిస్తున్నారు. ఎంతైనా రాజకీయాలు రాజకీయాలే. సో.. ఎక్కడ చిన్న లోపం కనిపిస్తుందా.. ఎక్కడైనా.. చిన్న లోటు కనిపిస్తుందా అని విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆయా లోపాలను వెలుగులోకి తెచ్చి.. ఏకేయడం ద్వారా పొత్తును విచ్చిన్నం చేయాలన్నది ప్రతిపక్షం ఆలోచన.
కానీ, ఇక్కడే పవన్-బాబులు ఎవరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇటీవల కేబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు కూర్చున్నారు. ఆయన పక్కనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూర్చు న్నారు. ఆయన పక్కన డిప్యూటీసీఎం పవన్ కూర్చున్నారు. దీంతో చంద్రబాబు.. పవన్‌ను దూరం పెడుతున్నారంటూ.. ఓ వర్గం మీడియా వార్తలు చెప్పుకొచ్చింది. డిప్యూటీ సీఎం కాబట్టి.. చంద్రబాబు తన కుడిపక్కనో.. ఎడమపక్కనో కూర్చోబెట్టుకోవాలని.. కానీ, సీఎస్ పక్కన కూర్చోబెట్టారని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు.
కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇక, తాజాగా విజయవాడ శివారులో నిర్వహించిన.. రామోజీ రావు సంస్మరణ సభలో పవన్-బాబు వ్యవహరించిన తీరు చూస్తే.. ఇలాంటి పిల్ల వ్యాఖ్యలకు పెద్ద ఫుల్ స్టాపే పెట్టేశారు.. సీఎం, డిప్యూటీ సీఎంలు. ఇద్దరూ కూడా ఒకే సోఫాలో పక్క పక్కన కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ.. మధ్యమధ్యలో నవ్వుతూ.. ఒకరికొకరు చాలా ఆప్యాయంగా కనిపించడం.. గమనార్హం. అంతేకాదు.. చంద్రబాబు పదే పదే పవన్‌ను పలకరిస్తూ..ఆయనకు ఏదో చెబుతున్న దృశ్యాలు.. ఆయన వాటిని ఆస్వాదిస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. బాబు-పవన్ ల మధ్య ఈ ముచ్చట చూశాక.. వీరి బంధం, వీరి ప్రభుత్వం కనీసంలో కనీసం పదేళ్లు ఖాయం అంటున్నారు!