ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయన భద్రతా సిబ్బందితో స్థానిక మంగళగిరి సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. పవన్ కల్యాణ్ అక్కడ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.
11 రోజుల వారాహి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలోనే సీఐ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా కొద్దిసేపు వేచి ఉండాలని భద్రతా సిబ్బంది చెప్పినా వినిపించుకోకుండా వారి మీద సీరియస్ అయ్యాడు. అంతే కాకుండా వాళ్ల మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా బూటు కాళ్లతోనే లోపలికి వెళ్లాడు.
దీంతో మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు దురుసు ప్రవర్తనపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.
సీఐ శ్రీనివాసరావు గతంలో కూడా జనసేన నాయకులతో ఇలాగే దురుసుగా ప్రవర్తించారని సమాచారం. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates