వైసీపీని టెన్ష‌న్‌లో పెట్టేసిన హైకోర్టు!

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు కార్యాల‌యాల కూల్చివేత‌పై బెంగ పెట్టుకుంది. అన‌ధికారి కంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను నిర్మిస్తున్న నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం వాటిని కూల్చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో వాటిని క‌క్ష పూరితంగానే కూల్చేస్తు న్నార‌ని పేర్కొంటూ.. వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. అయితే.. కూల్చివేత‌ల‌కు.. ఒక్క రోజు విరామం ఇవ్వాలంటూ.. హైకోర్టు ఆదేశించింది.

దీంతో గురువారం నాడు అధికారులు దూరంగానే ఉండిపోయారు. దీంతో మ‌రోసారి వైసీపీ నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించి.. కూల్చివేత‌ల‌ను నిలుపుద‌ల చేయించాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ వాద‌న‌లు వినిపించారు. వీటిని గ‌త ప్ర‌భుత్వం.. కేబినెట్ నిర్ణ‌యం మేర‌కు అనుమ‌తి ఇచ్చింద‌ని తెలిపారు. కానీ, ప్ర‌స్తుత రాష్ట్ర‌ ప్రభుత్వం రాజ‌కీయ‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివ‌రించారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని.. కార్యాల‌యాల‌ను కూల్చివేయ‌కుండా.. నిలువ‌రించాల‌ని హైకోర్టును అభ్య‌ర్థించారు.

దీనిపై మ‌రోసారి విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. తుది తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాలపై `స్టేటస్ కో` కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే.. ఆ ఉత్త‌ర్వులు ఎలా ఉంటాయ‌నే విష‌యంపై వైసీపీ నాయ‌కులు దిగులు పెట్టుకున్నారు. టెన్ష‌న్‌తో న్యాయ నిపుణులను ఆశ్ర‌యిస్తున్నారు. త‌మ వాద‌న‌లు ఎలా ఉన్నాయ‌న్న విష‌యంపైనా ఆరా తీస్తున్నారు. గ‌తంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల‌ను కూడా.. వారు అధ్య‌య‌నం చేస్తున్నారు. మొత్తానికి ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని టెన్ష‌న్ పెట్టిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు వారే టెన్ష‌న్ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.