అమరావతికి ఈనాడు విరాళం రూ.10 కోట్లు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ సంధర్భంగా ఆయన ప్రసంగించారు. 

‘నాన్న గారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 
తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. నాన్న గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం’ అని కిరణ్ అన్నారు.

నాడు ఆయన నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారని, ఆయన స్ఫూర్తితో అమరావతి నిర్మాణం కోసం తాము రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నామని ప్రకటించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  రామోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని చెప్పగా, అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.