జగన్ ప్రభుత్వంపై కీరవాణి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్మరణ సభకు రాజకీయ, పాత్రికేయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కీరవాణి కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు బతికినా చాలని గతంలో ఓ సభలో తాను అన్నానని, రామోజీరావు లాగా చనిపోవాలని ఈ సభలో అంటున్నానని కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కురుక్షేత్ర మహా సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చే వరకు ఆపారని, అదే మాదిరిగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి బయటపడడం చూసి ఆయన మరణించారని కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు..గత ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని, కానీ, కీరవాణి వంటి సంగీత దిగ్గజం చేసిన వ్యాఖ్యలు మాత్రం వాటన్నింటిని మించాయని సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దీనిని బట్టి సినీ రంగం గత ప్రభుత్వం చేతిలో ఎన్ని ఇబ్బందులకు గురైందో అర్థం చేసుకోవచ్చని చర్చిస్తున్నారు. ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడని కీరవాణి వంటి వారు సైతం జగన్ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తున్నారంటే వారి కడుపు ఎంత రగిలిపోయి ఉంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇక, రామోజీరావు ఫొటో దేవుడు ఉండాల్సిన చోట తమ ఇంట్లో ఉంటుందని, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి చిరకాలం ఉంటుందని కీరవాణి అన్నారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.