ఏపీకి రెండు `భార‌త‌ర‌త్న‌`లు..  బాబుకు పెద్ద టాస్క్‌!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌కు తానే స్వ‌యంగా త‌న‌ ముందు అతి పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌కు రెండు భారత‌రత్న‌లు సాధించేందుకు ఆయ‌న సంక‌ల్పం చెప్పుకొన్నారు. కొన్ని రోజుల కింద‌ట ఒక ర‌త్నాన్ని ఎంచుకోగా.. తాజాగా మ‌రో ర‌త్నాన్ని ఆయ‌న ప్ర‌తిపాదించారు. ఇద్ద‌రూ కూడా.. చంద్ర‌బాబుకు అత్యంత ద‌గ్గ‌రైన వారు.. అదే స‌మ‌యంలో అత్యంత అవ‌స‌ర‌మైన వారు. రాజ‌కీయంగా వారే ఆలంబ‌న‌గా చంద్ర‌బాబు సుదీర్ఘ ప్ర‌స్థానం కూడా సాగ‌డం విశేషం.

వారిలో ఒక‌రు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, చంద్ర‌బాబు మావ‌గారు.. ఎన్టీఆర్‌. రెండో వారు.. చంద్ర‌బాబును రాజ‌కీ యంగా చేయి ప‌ట్టి న‌డిపించి.. ఆయ‌న క‌ష్ట‌కాలంలో వెన్నుద‌న్నుగా ఉండి.. అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌రోక్షంగా స‌హ‌క‌రించిన ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు. ఈ ఇద్ద‌రికీ కూడా.. భార‌త‌ర‌త్న అవార్డులు సాధించాల‌న్న‌ది చంద్ర‌బాబు పెట్టుకున్న ల‌క్ష్యం. కొన్ని రోజుల కింద‌ట‌.. పార్టీ ఎంపీల‌తో స‌మావేశం నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న అవార్డు సాధించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు.

దీనికోసం పార్టీ ప‌రంగానే కాకుండా.. ప్ర‌భుత్వ ప‌రంగా కూడా.. చ‌ర్య‌లు తీసుకునేందుకు ఎంపీలు ప్ర‌య త్నించాల‌న్నారు. దీంతో ఎంపీలు ఆప‌నిపై ఉన్నారు. ఇక‌, తాజాగా విజ‌య‌వాడ శివారులో ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన.. రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో చంద్ర‌బాబు రెండో భార‌త ర‌త్న‌ను ప్ర‌తిపాదించారు. రామోజీకి భార‌త‌రత్న తీసుకురావ‌డం మ‌నంద‌రి క‌ర్త‌వ్యం అంటూ.. బాబు వ్యాఖ్యానించారు. అంటే.. ఆయ‌న పాత్ర మ‌రింత పెరిగింది.

ఏటా ఆగ‌స్టులో `ప‌ద్మ` అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీ. వీటితో పాటే భార‌త దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన భార‌త‌రత్న‌ను కూడా.. అదే నెల‌లో తొలుత ఎనౌన్స్ చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ ర‌త్నాలు సాధించేందుకు మ‌రో నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దీంతో చంద్ర‌బాబు ఏమేర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది చూడాలి. అయితే.. ఒకే రాష్ట్రానికి ఒకేసారి రెండు ర‌త్నాలు ప్ర‌క‌టించే సంప్ర‌దాయం లేదు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు ఉన్న నేప‌థ్యంలో సాకారం చేసుకునే అవ‌కాశం ఉండొచ్చు. చూడాలి.. మ‌రి ఏమేర‌కు ఆయ‌న స‌క్సెస్ అవుతారో!!