వాళ్లిద్దరికీ ఎమ్మెల్సీలు ఖరారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పెద్ద పీట వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో 175 శాసనసభ స్థానాలకు గాను 21 జనసేనకు, బీజేపీకి 10 శాసనసభ స్థానాలు కేటాయించడంతో టీడీపీ 144 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశానుసారం అభ్యర్థుల గెలుపుకోసం, కూటమి ఘనవిజయం కోసం కృషిచేసిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పోరేషన్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం కోసం కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుపుకోసం పనిచేసిన మహమ్మద్ ఇక్బాల్ లను శాసనమండలికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వీరిద్దరినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు సమాచారం.