ఎయిమ్స్ లో చేరిన బీజేపీ నేత అద్వానీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యల కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. 

అద్వానీ వయసు 96 సంవత్సరాలు. అద్వానీకి ఈ ఏడాది  భారతరత్న అవార్డు లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇది తనకే కాదు, తన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అద్వానీ అన్నారు. ఆయన ఆరోగ్య రీత్యా రాష్ట్రపతి, ప్రధాని ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు.

కరాచీలో జన్మించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చి ముంబయిలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన 1980లో వాజ్ పాయ్ తో కలిసి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఒకసారి రాజ్యసభ, ఏడు సార్లు లోక్ సభ సభ్యుడయిన ఆయన భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో ఆయన నిర్వహించిన రామజన్మభూమి రథయాత్ర బీజేపీ ఎదుగుదలకు కాలక్రమంలో దోహదం చేసింది.