ఇంత‌కీ ‘ఇండియా’ ఏం సాధించిన‌ట్టు?

భార‌త పార్ల‌మెంటు వ్య‌వ‌హారం.. జాతీయ‌స్థాయిలోనే కాకుండా.. ప్ర‌పంచ స్థాయిలోనూ చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. తాజాగా కొలువుదీరిన 18వ లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ ఎంపిక వ్య‌వ‌హారం కాస్తా.. ఎన్నిక‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ప‌ట్టు ప‌ట్టింది. మీరు స్పీక‌ర్ ప‌ద‌విని తీసుకోండి. మాకు ఉప స్పీక‌ర్ ప‌ద‌విని ఇవ్వండి! అని కోరింది. కానీ, మోడీ ప‌ట్టుబ‌ట్టి.. స్పీక‌ర్ ఎన్నిక వ‌చ్చేలా చేశారు.

దీంతో ఇండియా కూట‌మి కూడా రెడీ అని క‌ద‌న‌రంగంలోకి దిగింది. కేర‌ళ నుంచి 8 సార్లు విజయం ద‌క్కిం చుకున్న సురేష్‌ను స్పీక‌ర్ ఎన్నిక పోటీలో నిలిపింది. తీరా బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్నిక‌లో స‌హ‌జంగా అంద‌రూ ఊహించిన‌ట్టే మోడీ మ‌ద్ద‌తున్న ఓం బిర్లావిజ‌యం ద‌క్కించుకుని స్పీక‌ర్ అయ్యారు. మూజువాణి ఓట‌తో విప‌క్షం వీగిపోగా.. అధికార ప‌క్షం ఎన్డీయే స‌ర్కారు స‌భ‌లో విజ‌యంద‌క్కించుకుంది. ఇంత వ‌ర‌కు ఓకే.. మ‌రి ప‌ట్టుబ‌ట్టిన ఇండియా ఇప్పుడు ఏం సాధించిన‌ట్టు?

ఇదే ప్ర‌శ్న రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఇండియా కూట‌మి స్ప‌ష్టంగా మోడీకి ఎదురు వెళ్లింద‌నే చెప్పాలి. “ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను సాగ‌నివ్వం” అనే విష‌యాన్ని కూడా వెల్ల‌డించింది. స్పీక‌ర్ ఎన్నిక క‌నుక లేక‌పోతే.. మోడీ చేసిన‌వ్య‌వ‌హారం దేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చేది కాదు. ప్ర‌తిప‌క్షానికి క‌నీసం ఉప స‌భాప‌తి సీటును కూడా ఇచ్చేందుకు ఆయ‌న మ‌న‌సు అంగీక‌రించ‌డం లేద‌న్న విష‌యాన్ని ఇండియా కూట‌మి.. ప్ర‌పంచానికి చాటి చెప్పింది. త‌ద్వారా.. నైతిక విజ‌యం ద‌క్కించుకుంది.

అదే ఎన్నిక లేకుండా.. ఇండియా కూట‌మి స‌ర్దుకు పోయి ఉంటే.. అటు.. ఉప స‌భాప‌తి సీటు ద‌క్క‌క‌.. అస‌లు మోడీ ఏం చేస్తున్నారో.. ఆయ‌న వ్యూహం ఏంటో అనేది కూడా.. ఈ ప్ర‌పంచానికి తెలిసేదికాదు. మొత్తానికి త‌మ‌కు ప‌ద‌వి ద‌క్క‌క పోయినా.. ఎన్నిక‌కు సిద్ధం కావ‌డం ద్వారా.. మోడీ వ్యూహాన్ని, ప్ర‌తిప‌క్షాల‌కు క‌నీసం చిన్న‌పాటిప‌ద‌వి ఇచ్చేందుకు, సంప్ర‌దాయాల‌ను కాపాడేందుకు కూడా అనుమ‌తించ‌ని ఆయ‌న నైజాన్ని విశ‌ద‌ప‌రిచిన‌ట్టు అయింది. అయితే.. ఇక వ‌చ్చే ఐదేళ్లు కూడా.. పార్ల‌మెంటులో డిప్యూటీ స్పీక‌ర్ అనే మాట వినిపించ‌ద‌న్న‌మాట‌. ఇదొక కొత్త సంప్ర‌దాయం.. మోడీ సంప్ర‌దాయం కావొచ్చు!!