జగన్ భయం అదేనా?

Y S Jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల నుంచి ఐదుగురిని లాగేస్తే పది శాతం ఎమ్మెల్యేలు కూడా లేక చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారంటూ ఎద్దేవా చేసిన జగన్.. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నేత కావాలంటే పది శాతం ఎమ్మెల్యేలు ఉండి తీరాలన్న నిబంధనేమీ రాజ్యాంగంలో లేదని మాట్లాడుతుండడం విడ్డూరం.

ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి తర్వాత తనకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఐతే ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా.. ప్రతిపక్ష నేత హోదా కోసం ఈ పట్టేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రెండు నెలల ముందు వైనాట్ 175 అన్న వ్యక్తి.. ఇప్పుడు ప్రతిపక్ష నేత కావడానికి పోరాడుతుండటం చూసి పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అని జనం చర్చించుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ అంతగా ఎందుకు తపించిపోతున్నారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆ హోదా ఉంటే జగన్‌కు కొన్ని సౌలభ్యాలుంటాయి. అది క్యాబినెట్ హోదాకు సమాధానం. అసెంబ్లీలో ముందు వరుసలో సీట్ లభిస్తుంది. ఏ అంశం మీదైనా నేరుగా ముఖ్యమంత్రిని ప్రశ్నించవచ్చు. కోరినంత సమయం మైక్ దక్కుతుంది. ఇవి కాక మంత్రులకు ఉండే సెక్యూరిటీ ఉంటుంది. మరికొన్ని సౌకర్యాలు కూడా లభిస్తాయి. అన్నింటికీ మించి ఏదైనా కేసులో ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కేసుల పరంగా మరికొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. కానీ ప్రజల తీర్పుతో జగన్ ఈ సౌలభ్యాలన్నీ కోల్పోయి జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలారు.

ఇప్పటికే పదుల సంఖ్యలో అవినీతి కేసులున్నాయి జగన్ మీద. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాల మీద కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. కాబట్టి మరిన్ని కేసులు ఎదుర్కోక తప్పదు. వీటిలో జగన్ అరెస్టయినా ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నేతగా ఉంటే ఆయనకు కేసులు, అరెస్టుల నుంచి ఎంతో కొంత రక్షణ ఉండేది. ఇవన్నీ కోల్పోయేసరికి జగన్‌కు భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.