ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి 70 వేల మెజారిటీతో విజయం దక్కించుకున్న పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ఆయన గెలిచిన తర్వాత, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు సార్లు పిఠాపురం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 25నే ఆయన పిఠాపురం వెళ్తారని తొలుత జనసేన పార్టీ ప్రకటించింది. తర్వాత.. వారాహి అమ్మవారి దీక్ష ఉన్న నేపథ్యంలో 27నుంచి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారని షెడ్యూల్ మార్చారు. అయితే..ఈ రెండు సార్లు కూడా పర్యటనలు రద్దయ్యాయి.
తాజాగా ఇప్పుడు మరోసారి పవన్ పర్యటనకు సంబంధించి మరో ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. జూలై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పవన్ పిఠాపురంలో పర్యటిచంనున్నారు. మూడు రోజులు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేసమయంలో ఆయన బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. పిఠాపురం ప్రజలు తనను గెలిపించినందను కృతజ్ఞతగా వారికి ఆయన ధన్యవాదాలు తెలపనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. అదేసమయంలో ప్రజల నుంచి వారి వ్యక్తిగత, నియోజకవర్గ సమస్యలపైనా దరఖాస్తులు తీసుకుంటారు. కీలక సమస్యలను క్షేత్రస్తాయిలో పర్యటించి పరిశీలిస్తారు. మొత్తం మూడు రోజుల పర్యటనను అధికారికంగానే నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఇదీ షెడ్యూల్!
జులై 1: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ప్రజల అర్జీలు తీసుకుంటారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు.
జూలై 2: పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారు
జూలై 3: కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటారు. అదేసమయంలో ప్రజల నుంచి మూడు రోజుల పాటు సమస్యలపై అర్జీలు తీసుకోనున్నారు.