ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించకపోవడం, ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులంతా ఆ పని పూర్తి చేశాకే తనకు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు గవర్నర్‌కు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ సాక్షి పత్రిక ఇదే వాదన చేస్తుండగా.. జగన్ సైతం లేఖ ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు.
ఐతే జగన్ లేఖ గురించి వార్త ఇలా బయటికి వచ్చిందో లేదో.. నిమిషాల్లో కౌంటర్ పోస్టులు పడిపోయాయి సోషల్ మీడియాలో. జగన్ సీఎంగా ఉండగా 23 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎద్దేవా చేస్తూ ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందంటూ ఎగతాళిగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అప్పుడు పది శాతం ఎమ్మెల్యేలు లేకుంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతాడని అన్న జగన్.. ఇప్పుడు 11 ఎమ్మెల్యేలకు పరిమితమైన పార్టీని నడిపిస్తూ ఆ హోదాను ఎలా కోరుకుంటారని ప్రశ్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఇష్యూలోనే కాదు.. రుషికొండలో కట్టుకున్న ప్యాలెస్ జగన్ ఇల్లు కాదు, ప్రభుత్వ టూరిజం భవనం అన్న వాదనకు కూడా జగన్ అండ్ కో గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలే కౌంటర్‌గా ఉపయోగపడ్డాయి. అలాగే వైసీపీ కార్యాలయం కూల్చివేత గురించి ఆ పార్టీ వాళ్లు గగ్గోలు పెడితే గతంలో జగన్ అక్రమ కట్టడాల కూల్చివేత గురించి సీఎంగా జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం తాలూకు వీడియోనే కౌంటర్ కోసం యాంటీస్ వాడుకున్నారు.
ఇలా ఇప్పుడు వైసీపీ వాళ్లు ఏ ఇష్యూలో గగ్గోలు పెట్టిన పాత వీడియోల కారణంగా వారి వాదన తేలిపోతోంది. ఒక రకంగా జగన్‌కు జగనే శత్రువుగా మారిపోతున్నాడని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates