వైసీపీ మాజీ ఎంపీపై కూట‌మి స‌ర్కారు ఫ‌స్ట్ యాక్షన్‌!

కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై దృష్టి పెడుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో స‌ర్కారు ద‌న్ను చూసుకుని చెల‌రేగిన చాలా మంది నాయ‌కులు.. భూముల‌ను క‌బ్జా చేసేందుకు య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ.. ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్‌.. సినీ నిర్మాత కూడా అయిన‌.. ఎంవీవీ స‌త్య‌నార‌య‌ణ‌పై విశాఖ‌ప‌ట్నంపోలీసులు నాన్ బెయిలబుల్ కేసు న‌మోదు చేశారు.

విశాఖ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ పార్ల‌మెంటు ప‌రిధిలో చాలా మంది నుంచి భూములు త‌క్కువ‌ధ‌ర‌ల‌కు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రి నుంచి భూములు తీసుకుని.. వారి నుంచి ఎదురు వైట్ పేప‌ర్ల‌పై సంత‌కాలు చేయించుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు బండారు, వెల‌గ‌పూడి వంటివారు మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే..తాజా ఎంవీవీ ఓడిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు బాధితులు ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌స్తున్నారు. రియ‌ల్ రంగంలో పేరున్న హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు తాజాగా ఎంవీవీ స‌త్య‌నారాయణ‌పై కేసు పెట్టారు. ఎంవోయూ పేరిట కొన్ని వైట్ పేప‌ర్ల‌పై అప్ప‌టి ఎంపీ స‌త్య‌నారాయ‌ణ ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని ఆయ‌న పోలీసుల‌కు తెలిపారు. దీని వెనుక త‌న విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన పోలీసులు ఎంవీవీ స‌త్యానారాయ‌ణ‌తోపాటు.. ఆయ‌న ఆడిట‌ర్ గ‌న్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌రావు, మ‌రో రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ విష‌యంపై ఎంవీవీ మీడియా ముందుకు కానీ.. వ్య‌క్తిగ‌తంగా కానీ స్పందించ‌లేదు. నేరుగా హైకోర్టు త‌లుపు త‌ట్టారు. త‌న‌పై రాజ‌కీయ దుగ్ధ‌తోనే కేసు పెట్టార‌ని.. టీడీపీ నేత‌ల ప్రోద్బ‌లం ఉంద‌ని ఆరోపిస్తూ.. ఆయ‌న హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. దీంతో ఈ కేసు పూర్వాప‌రాలు వెలుగు చూశాయి.