తిరుమ‌ల‌కు రాజ‌ధాని రైతుల యాత్ర‌.. ఇప్పుడెందుకు?

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర‌గా ముందుకు ప‌య‌న‌మ‌య్యారు. దాదాపు 500 మంది రైతులు.. పాద‌యాత్ర‌గా మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌కు బ‌య‌లు దేరారు. ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం లేకుండానే వారు మెరుపు నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ.. వైసీపీ పాల‌న‌లో ‘న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం’ పేరుతో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను అన్యాయం చేస్తోందంటూ అంద‌రూ క‌దం తొక్కారు.

దాదాపు రెండు నెల‌ల పాటు ఈ యాత్ర సాగింది. 400 కిలో మీట‌ర్ల దూరాన్ని మ‌హిళ‌లు, వృద్ధులు, రైతు కూలీలు, కార్మికులు.. ఇలా అంద‌రూ పాద‌యాత్ర‌గా క‌దిలి శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణానికి త‌మ విలువైన భూములు ఇచ్చామ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు ఆ రాజ‌ధానిని కుప్ప‌కూలుస్తోంద‌ని.. రైతులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల శ్రీవారే త‌మ‌కు, రాష్ట్రానికి కూడా న్యాయం చేయాల‌ని అప్ప‌ట్లో రైతులు ఈ యాత్ర చేశారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం ఈ యాత్ర‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డింది. అయితే.. న్యాయ స్థానం కొన్ని ష‌ర‌తుల‌తో అనుమ‌తి ఇచ్చింది. అయినా.. మార్గమ‌ధ్యంలో రైతుల‌ను, పాద‌యాత్ర చేస్తున్న వారిని వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. అయినా.. స్వామిపైనే భారం వేసిన రైతులు ముందుకు సాగారు. త‌మ మొక్కులు తీర్చుకున్నారు. చివ‌ర‌కు ద‌ర్శ‌నాల వ‌ద్ద కూడా.. అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆంక్ష‌లు విధించారు. వాటిని కూడా ఛేదించుకున్న రైతులు.. స్వామి వారి శ‌ర‌ణు జొచ్చారు.

కాగా, ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ కుప్ప‌కూల‌డం.. కూట‌మి స‌ర్కారు గ‌ద్దెనెక్క‌డం.. అమ‌రావ‌తి రాజ‌ధానికి ఆక్సిజ‌న్ అంద‌డంతో రాజ‌ధాని రైతులు ఆంనంద‌తో ఉన్నారు. త‌మ ఆనందానికి, అమ‌రావ‌తి నిల‌బ‌డ‌డానికి.. శ్రీవారి క‌రుణే కార‌ణ‌మ‌ని..వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో స్వామి వారిని మ‌రోసారి ద‌ర్శించుకుని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించేలా ద‌య చూపాల‌ని కోరుకుంటూ.. మ‌రోసారి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు. మ‌రి ఇది ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలి.