బీజేపీలో చేరాల్సిన ఖర్మ, అవసరం నాకు లేదు: మిథున్ రెడ్డి

ఇటీవల వెలువడిని సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. శాసన సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక, లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అంతేకాదు, బీజేపీలోకి వైసీపీ ఎంపీలను చేర్చేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారాన్ని మిథున్ రెడ్డి ఖండించారు.

బీజేపీలో చేరాల్సిన ఖర్మ, అవసరం తనకు లేదని మిథున్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాను పార్లమెంటు లో పనిచేస్తానని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఆశీస్సులతో, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి పార్లమెంటులో అడుగుపెట్టి హ్యాట్రిక్ కొట్టానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే బిల్లులకు మద్దతిస్తానని, లేని బిల్లులను వ్యతిరేకిస్తానని చెప్పారు. తాను బీజేపీలోకి వెళతానని కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతూ దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాను విపక్షంలో ఉన్నపుడు కూడా ఇటువంటి ప్రచారం జరిగిందని మిథున్ రెడ్డి తెలిపారు. తనను జగన్ సొంత తమ్ముడిలా చూసుకున్నారని, భవిష్యత్తులో జగన్ నేతృత్వంలో తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. రాజంపేటలో అత్యధిక రహదారులు నిర్మించిన ఘనత వైసీపీదని, మాట నిలబెట్లుకున్న నేతగా జగన్ ను జనం అభిమానిస్తారని చెప్పారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు త్వరలో గ్రహిస్తారని అన్నారు.