కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం !

లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగుతున్నది. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితం అయింది. జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుల అంశాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని ప్రజాపనుల మంత్రి సతీశ్‌ జార్కిహోళి, సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ బహిరంగంగా డిమాండ్‌ మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యపై వారు ఒత్తిడి తెస్తున్నారు. సతీశ్‌ జార్కిహోళి, కేఎన్‌ రాజన్న ఎస్టీ వర్గానికి చెందినవారు కాగా, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ముస్లిం. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది.

సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్‌లో పార్టీ ఓటమిపాలైంది. అలాగే బెంగళూరు రూరల్‌ స్థానంలో తన సోదరుడు డీకే సురేశ్‌ను శివకుమార్‌ గెలిపించుకోలేకపోయారు. మైసూరులో బీజేపీ అభ్యర్థి క్రిష్ణదత్త చామరాజ వడియార్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ణపై 1,39,262 ఓట్లతో గెలవడం విశేషం. బెంగుళూరు రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మంజునాథ్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ ను 2,69,647 ఓట్లతో ఓడించడం గమనార్హం.

అదనపు ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలని లోక్ సభ ఎన్నికల ముందు సీనియర్ మంత్రులు జీ పరమేశ్వర, సతీశ్‌ జార్కిహోళి, హెచ్‌సీ మహదేవప్ప, రాజన్న, కేహెచ్‌ మునియప్ప తదితరులు ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈ డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఎక్కడికి దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.