అమర్‌నాథ్ అంత మాట అనేశాడేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాక.. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపిస్తూ బాగానే హైలైట్ అయ్యాడు గుడివాడ అమర్‌నాథ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్‌నాథ్.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి తెలుగుదేశం మీద.. అలాగే జనసేన మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే అయినా.. మంత్రి స్థాయికి తగ్గట్లు హుందాగా మాట్లాడకపోవడం వల్ల పలు సందర్భాల్లో ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో ఆయన ఒకరు అనడంలో సందేహం లేదు. ఏపీలో పరిశ్రమలు లేకపోవడం గురించి స్పందిస్తూ.. ఓ సందర్భంలో ఆయన చెప్పిన ‘కోడిగుడ్డు పురాణం’తో తన ఇంటిపేరే ‘గుడ్డు’గా మారిపోయింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో వెలుగుు చూస్తున్న వ్యవహారాలపై పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్లలో అమర్‌నాథ్ ఒకరు. రుషికొండ ప్యాలెస్ విషయంలోనూ ఆయన తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్లే మాట్లాడారు. కానీ లేటెస్ట్‌గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

అమరావతి ఆఫీస్ కూల్చివేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైసీపీ అక్రమ కట్టడాలపై నోటీసులు ఇస్తున్నారు అధికారులు. విశాఖపట్నంలోని మధురవాడలోని ఓ ఆఫీస్‌ విషయంలోనూ ఇలాగే నోటీసులు ఇవ్వగా.. అక్కడికి వచ్చిన అమర్‌నాథ్ ఓ విలేకరి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. “అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడే అమర్‌నాథ్.. తమ ప్రభుత్వంలో కూల్చివేతల గురించి ఇలా విమర్శనాత్మకంగా మాట్లాడేశాడేంటి.. జగన్ ఇలాంటి మాటలు విని ఊరుకుంటాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.