ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయకుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయకులు ఏమీ ఆశించకుండా కూటమి విజయం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్లను పదవులతో గౌరవించేందుకు బాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇంతకీ ఆ 31 మంది ఎవరూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వదులుకున్న టీడీపీ నాయకులే.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 175కి గాను 144 స్థానాల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా మిగతా 31 స్థానాల్లో.. 21 స్థానాలను జనసేనకు, 10 స్థానాలను బీజేపీకి కేటాయించింది. దీంతో ఈ 31 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అదే 2019లో టీడీపీ ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేయడంతో నాయకులందరూ బరిలో దిగారు. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. జగన్‌ను గద్దె దించాలనే లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొంతమందికి టికెట్లు దక్కలేదు. ముఖ్యంగా ఈ 31 మంది టీడీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. కానీ బాబు మాటకు కట్టుబడి వీళ్లు కూటమి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.
ఉదాహరణకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కోసం టీడీపీ ఇంఛార్జీ వర్మ ఎంతలా కష్టపడ్డారో చూశాం. ఇదే విధంగా మిగతా 30 నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓట్లు.. కూటమి అభ్యర్థులకు పడేలా ఈ నాయకులు చూశారు. అందుకే ఇప్పుడీ 31 మందికి పదవులు ఇచ్చేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని చాటేందుకే నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ, శాసన మండలిలో ఖాళీ అయ్యే స్థానాలను వీళ్లకు కట్టుబెట్టే అవకాశముంది.