కేసీఆర్ చేస్తే రైటూ.. రేవంత్ చేస్తే రాంగా?

ఎవ‌రు చేసిన కర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు! అధికారం ఉంది క‌దా.. రాష్ట్రంలో అడ్డు ఎవ‌రు? అనే అహంకారంతో సాగే వాళ్లకు కాల‌మే స‌మాధానం చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన తొలి రెండు ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని ఈ పార్టీల‌ను కేసీఆర్ దెబ్బ‌కొట్టారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అనేదే లేకుండా చూడాల‌నుకున్నారు.

కానీ కేసీఆర్‌కు ఇప్పుడు అదే దెబ్బ రిట‌ర్న్‌లో త‌గులుతోంది. ఈ సారి ఆ దెబ్బ కొడుతోంది రేవంత్ రెడ్డి. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది.

దానం నాగేందర్‌, తెల్ల వెంక‌ట్రావ్‌, క‌డియం శ్రీహ‌రి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్ప‌టికే కారు దిగి చేయి అందుకున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్యేల జాబితా పెద్ద‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇన్ని రోజులు లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజీబిజీగా గ‌డిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీలో చేరిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. ఇందుకోసం స్వ‌యంగా రేవంత్ రంగంలోకి దిగారనే చెప్పాలి. పోచారం ఇంటికి రేవంత్ స్వ‌యంగా వెళ్ల‌డ‌మే అందుకు రుజువు.

ఇక హైద‌రాబాద్ నుంచే మ‌రో అయిదారుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నుంచి ఓ ఎమ్మెల్యే, మెద‌క్ నుంచి ముగ్గురు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

చివ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్ రావు, ప‌ల్లా రాజేశ్వ‌ర్ మాత్ర‌మే బీఆర్ఎస్‌లో మిగిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు త‌మ‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేర‌డంతో బీఆర్ఎస్ నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. బెదిరించి, ఆశ చూపించి అక్ర‌మంగా పార్టీలోకి చేర్చుకుంటున్నార‌ని అంటున్నారు.

పార్టీ నుంచి వెళ్లే నాయ‌కులు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఇదే కేసీఆర్ 2014లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 12 మందిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని టీడీపీ శాస‌న‌స‌భ ప‌క్షాన్ని విలీనం చేసుకున్నారు.

అప్పుడు రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, ఆర్‌.కృష్ణ‌య్య మాత్ర‌మే టీడీపీలో మిగిలారు. 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌నూ కేసీఆర్ చేర్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.

ఇలా టీడీపీ, కాంగ్రెస్ అనేదే లేకుండా చేయాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నించారు. అప్పుడు కేసీఆర్ చేసిందాన్ని స‌మ‌ర్థించిన వాళ్లు ఇప్పుడు రేవంత్ చేస్తున్న దాని ఎందుకు విమ‌ర్శిస్తున్నార‌ని జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న వ‌ర‌కు వ‌చ్చేస‌రికి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు నొప్పి తెలుస్తుందా? అని అడుగుతున్నారు.