కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్లు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.
వైఎస్ అయినా, ఆయన వారసుడు జగన్ అయినా.. పులివెందులకు వెళ్లకుండా, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండానే అక్కడ ఎన్నికల్లో గెలిచేస్తుంటారు. వారికి భారీ మెజారిటీలు కూడా గ్యారెంటీ.
ఐతే ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ కొంచెం తగ్గింది. సొంత నియోజకవర్గంలోనూ జగన్‌కు వ్యతిరేకత తప్పలేదనే చర్చ జరిగింది ఫలితాల సమయంలో. కాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తర్వాతి రోజే పులివెందులకు వెళ్లగా.. అక్కడ ఆయన ఇంటి దగ్గర కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు.. ఇంటిమీద రాళ్ల దాడి చేస్తే కిటికీల అద్దాలు పగిలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఐతే కొన్ని వీడియో దృశ్యాలు చూస్తే అక్కడి వాతావరణం కొంచెం గందరగోళంగా తయారైనట్లే కనిపించింది.
సొంత పార్టీ కార్యకర్తల నుంచే జగన్ తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని.. సీఎంగా ఉండగా తమను పట్టించుకోకుండా ఓడిపోయాక నియోజకవర్గానికి వస్తారా అంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్.. కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది.
జగన్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారని.. ఇందుకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో గందరగోళం నెలకొని అద్దాలు పగిలాయని.. అంతే తప్ప అక్కడ నిరసనలు, అందోళనలు లాంటివేమీ జరగలేదని వైసీపీ హ్యాండిల్లో పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీతోనూ ఈ మేరకు వివరణ ఇప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates