చంద్రబాబు మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. దశాబ్దాల తరబడి ఒకే తీరును ప్రదర్శించే ఆయన ఇప్పుడు కొత్త వెర్షన్ లో కనిపిస్తున్నారు. అధికారం.. ప్రతిపక్షం ఆయనకు అలవాటే అయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. బాబులో మార్పు ఎంతన్న విషయం మరింత బాగా అర్థమవుతుంది.
ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే కేంద్రంలో చక్రం తిప్పాలన్న తహతహ బాబులో ఎక్కువే. వాజ్ పేయ్ హయాంలోనూ ఆయన ఆ పని చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వేళ.. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆయన.. అప్పట్లోనూ ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించటమే కాదు..వారంలో రెండు రోజులు ఢిల్లీకి అంటూ అప్పట్లో చెప్పుకున్నారు కూడా. కానీ.. మోడీ తీరుతో ఆయన అనుకున్నది సాగలేదు.
ఆ తర్వాత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆయన.. ఐదేళ్లు ఎన్ని అవస్థలు పడింది అందరికి తెలిసిందే. ఈ సమయంలోనే నమ్మకస్తులైన మిత్రులు ఎవరు? పార్టీకి అసలేం అవసరం? పవర్ చేతిలో ఉన్నప్పుడు చక్కదిద్దాల్సిన అంశాలేమిటి? లాంటి ఎన్నో అంశాలపై ఆయనకు క్లారిటీ వచ్చిందని చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పే వీలుంది. కానీ.. ఆ పనికి దూరంగా ఉన్న ఆయన.. తన ఫోకస్, ప్రయారిటీ మొత్తం ఏపీనే అన్న విషయాన్ని తరచూ స్పష్టం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని పార్టీ నేతలతో పంచుకున్న ఆయన.. స్పీకర్ పదవి తీసుకోవాలని కోరారని..కానీ తాను వద్దని చెప్పిన వైనాన్ని వెల్లడించి అందరిని విస్మయానికి గురి చేశారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు అడగాలే కానీ.. నో చెప్పే పరిస్థితి మోడీ సర్కారుకు లేదు. అలా అని తనకున్న బలాన్ని బ్లాక్ మొయిల్ రాజకీయాలుగా మార్చటానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.
గడిచిన ఐదేళ్లుగా సాగిన పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బ తిన్నదని.. దాన్ని సరిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక బలాన్ని తమకు అందించాలన్న విషయాన్ని మాత్రమే మోడీని కోరాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే.. స్పీకర్ పదవి తమకు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని తాను కోరినట్లుగా చెప్పిన చంద్రబాబు.. ఏపీ ప్రజలు కూటమిని నమ్మి అధికారం ఇచ్చారని.. తమకు జాతీయస్థాయి పదవులు అస్సలు అక్కర్లేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా చంద్రబాబు పూర్తిగా మారిపోయారంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates