ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే పవన్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి పెండింగ్‌లో ఉన్న తన సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో పడతాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
కానీ ఫలితాల తర్వాత కథ మారిపోయింది. కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన అద్భుత ఫలితాలు రాబట్టింది. పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు.
దీంతో సీరియస్‌గా రాజకీయాల మీద దృష్టిపెట్టక తప్పట్లేదు. నాలుగు శాఖల మంత్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలకు ఇప్పుడే ప్రాధాన్యం ఇవ్వలేరనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవన్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న నిర్మాత ఏఎం రత్నం కూడా ఈ సంకేతాలే ఇచ్చారు.
జులై తొలి వారంలో పవన్ ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణకు హాజరవుతాడంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. పవన్ ఇప్పుడే షూటింగ్‌కు అందుబాటులోకి రారని ఆయన తేల్చేశారు.
పవన్‌కు ప్రస్తుతం రాజకీయంగా చాలా బాధ్యతలు ఉన్నాయని.. వాటి కోసమే సమయం వెచ్చిస్తున్నారని.. తర్వాత వీలు చూసుకుని చిత్రీకరణకు హాజరవుతారని ఆయన చెప్పారు.
‘హరిహర వీరమల్లు’ పార్ట్-1కు సంబంధించి పవన్ మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలు తక్కువే అయని.. కొన్ని రోజుల సమయమే సరిపోతుందని.. ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తాడన్నదాన్ని బట్టి సినిమాను పూర్తి చేస్తామని.. ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో మిగతా పార్ట్ చిత్రీకరణ బాధ్యత రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates