వైసీపీలో నాయకుల వ్యవహార శైలి ఎన్నికల్లో ప్రభావం చూపిందనేది వాస్తవం. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. బూతులు మాట్లాడడం.. రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. టీడీపీ సీనియర్లపైనా పరుష పదజాలంతో విరుచుకుపడడం ఒక ఫ్యాషన్ అని ఎక్కువ మంది భావించారు. ఇలా చేయడమే రాజకీయ మని అనుకున్నారు. అంతేకాదు.. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో పడాలంటే కూడా.. ఇలానే చేయాలన్న వాదన కూడా బయటకు వచ్చింది.
దీంతో కొడాలి నాని, రోజా, దువ్వాడ శ్రీనివాస్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ వంటి అనేక మంది నాయకులు రెచ్చిపోయారు. చంద్రబాబుపై దూషణల పర్వానికి, పవన్‌కల్యాణ్‌పై వెకిలి మాటలకు.. నారా లోకేష్‌పై నోరు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పరిణామాలు.. మాస్‌లోనూ.. వైసీపీకి ఇబ్బంది తెచ్చి పెట్టాయి. ఇక, క్లాస్‌ను చాలా దూరం నెట్టాయి. దీంతో ఊహించని విధంగా వైసీపీ అగచాట్లు ఎదుర్కొంది.
గెలుస్తామని భావించిన.. కంచుకోటల్లోనూ వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అంతేకాదు.. ఫైర్‌ను మూట గట్టుకుని ముందుకు వెళ్లిన వారంతా.. ఎన్నికల్లో మలమలా మాడిపోయారు. కొడాలి ఓడిపోయారు.. రోజా నలిగిపోయారు. దువ్వాడ అడ్రస్ లేకుండా పోయారు.
సో.. మొత్తంగా ఫైర్ పనిచేయలేదు. పైగా.. కాల్చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో అయినా.. వీరు ఫైర్‌ను కంట్రోల్ చేసుకోకపోతే.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకపోతే.. బ్రాండ్ మరింత పడిపోతుందని అంటున్నారు పరిశీలకులు.
ఫైర్ బ్రాండ్ అంటే.. ప్రజల సమస్యలపై నిలదీయాలి. గతంలో ఇదే జరిగేది. ప్రబుత్వం చెబుతున్న దానికి కౌంటర్‌గా ప్రజాసమస్యల తాలూకు వాస్తవాలతో నాయకులు నిలదీశేవారు. దీంతో వారిపై ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేశారు. కానీ, వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలను తిడితే.. ఎంత ఎక్కువగా తిడితే .. అంత ఎక్కువగా వారిపై ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. కానీ.. ఇది మొత్తానికే చేటు తెచ్చింది. ఇప్పటికైనా ఫైర్ మానుకుంటే.. వారిపై వాస్తవ బ్రాండ్ పడుతుందని అంటున్నారు పరిశీలకులు.