శ‌భాష్ స్పీక‌ర్‌గారూ… ఊపిరి పీల్చుకో మీడియా!

ఏపీలో కొత్త‌గా ఎన్నికైన అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మీడియాకు స్వేచ్ఛ క‌ల్పిస్తూ.. ఆయ‌న తొలి సంత‌కం చేశారు. అసెంబ్లీ కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేయ‌డంలో మీడియాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆంక్ష‌ల‌ను ఆయ‌న తొల‌గించారు.

ప్ర‌తిమీడియాకు స్వేచ్ఛ ఉండాల‌ని.. మీడియా ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉండాల‌ని అయ్య‌న్న ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు స‌హా.. అసెంబ్లీకి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను లైవ్‌లో ప్ర‌సారం చేసుకునేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు తెలిపారు.

దీనికి సంబంధించిన ఫైల్‌ను ఏరికోరి ఆయ‌న తెప్పించుకుని.. త‌న తొలి సంత‌కం చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ఉన్న నిషేధం ఎత్తివేసిన‌ట్టు అయింది. వీటిలో ఈటీవీ, టీవీ-5, ఏబీఎన్ వంటి కొన్ని చాన‌ళ్లు ఉన్నాయి.

ఇప్పుడు వీటికి అన్ని కార్య‌క్ర‌మాలు లైవ్‌లో ప్ర‌సారం చేసుకునేందుకు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే.. వైసీపీ హ యాంలో కొన్ని మీడియా ఛానెళ్ల‌ను నిలిపి వేసిన విష‌యం తెలిసిందే. టీడీపీ నేత‌ల‌కు.. ఆ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నాయ‌ని.. అదేస‌మ‌యంలో వైసీపీపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నాయ‌ని పేర్కొంటూ.. కొన్ని చానెళ్ల‌పై నిషేధం విధించారు.

అప్ప‌ట్లో ఆయా ఛానెళ్లు ట్రాయ్‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. అయితే.. అప్ప‌టి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. త‌న‌కు ఉన్న విచ‌క్ష‌ణాధికారాల‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పారు. దీంతో ఎవ‌రూ ఏమీ చేయ‌లేక పోయారు. అసెంబ్లీ వ్య‌వ‌హారాల విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌య‌మే అంతిమం కావ‌డం.. ఎవ‌రూ జోక్యం చేసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో నిషేధం గ‌త ఐదేళ్లు కూడా కొన‌సాగింది.

దీంతో అసెంబ్లీ స‌మావేశాల‌ను లైవ్‌లో ప్ర‌సారం చేయ‌లేక పోయాయి. పొరుగు ఛానెళ్ల‌ను బ‌తిమాలుకుని.. లైవ్ లింకులు తెచ్చుకున్న‌ చానెళ్లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న తీసుకున్న నిర్ణ‌యంతో మీడియాకు స్వేచ్ఛ వ‌చ్చిందంటూ.. ఆయా వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.