వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలమంది మహిళల అదృశ్యం మీద గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో వైసీపీ వాళ్లు ఒకప్పటి జనసేనాని ఆరోపణలను గుర్తు చేసి చర్యలు చేపట్టాలంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వచ్చాక ఇలాంటి విషయాలను నాయకులు మరిచిపోతుంటారు. కానీ పవన్ అలా కాదు. తన పరిధిలో ఏం చేయగలరో అది చేయడానికి సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది.
శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పవన్ సామాన్య ప్రజల కోసం అమరావతిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం విశేషం. డిప్యూటీ సీఎం అయి ఉండి హంగు ఆర్భాటాలు లేకుండా పవన్ ఇలాంటి కార్యక్రమం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కార్యక్రమంలో తన కుమార్తె తొమ్మిది నెలల కిందట కనిపించకుండా పోవడం గురించి ఒక మహిళ ఏడుస్తూ వెళ్లగక్కిన ఆవేదనను అర్థం చేసుకుని పవన్ సత్వరం స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె చెప్పింది.. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఆమె తెలపగా.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నాడు. దీనిపై చర్యలకు ఆదేశించారు. అంతే కాక పవన్ పార్టీ నాయకులను వెంటబెట్టి బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించడం విశేషం.