రుషికొండ ప్యాలెస్ ను కొంటా: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖప‌ట్నంలోని రుషికొండపై వైసీపీ హ‌యాంలో నిర్మించిన ఇంద్ర‌భ‌వ‌నం.. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొం దిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో దీనిని నిర్మించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. అంత‌క‌న్నా ఎక్కువ సొమ్మునే దీనికి కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వైసీపీ ప‌డిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

కానీ, తాజాగా ఈ ప్యాలెస్‌ను తాను కొనుగోలు చేస్తానంటూ.. సుఖేశ్ చంద్ర‌.. ఏపీ స‌ర్కారుకు లేఖ రాశారు. అంతేకాదు.. తాను పంపిస్తున్న ఈ లేఖ‌ను ఒప్పందంగా భావించాల‌ని కూడా ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇక‌, ఈ ప్యాలెస్‌కు.. ఎంత ధ‌ర పెట్టినా.. దానిపై 20 శాతం చొప్పున అద‌నంగా తాను చెల్లించి కొనుగోలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ అమ్మ‌డం ఇష్టం లేక‌పోతే.. క‌నీసం త‌న‌కు లీజుకైనా ఇవ్వాల‌ని కోరారు. ఈ విష‌యంలోనూ త‌న లేఖ‌ను ఒప్పంద ప‌త్రంగా భావించాల‌న్నారు.

ఇదే స‌మ‌యంలో త‌న బాల్యాన్ని కూడా సుఖేశ్ ప్ర‌స్తావించారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. విశాఖ ప‌ట్నంతోను.. ఆర్కే బీచ్‌తోనూ త‌న‌కు ఎన‌లేని సంబంధం ఉంద‌ని సుఖేశ్ వివ‌రించారు. తాను తెలుగు కూడా మాట్లాడ‌గ‌ల‌న‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న సుదీర్ఘ‌లేఖ రాశారు. అయితే..చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఎవ‌రీ సుఖేశ్‌?

ఢిల్లీలో వెలుగు చూసిన వేల కోట్ల రూపాయ‌ల మ‌ద్యం కుంభ‌కోణంలో సుఖేశ్ చంద్ర కూడా ఉన్నారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈయ‌న‌ను ఈడీ అరెస్టు చేసి.. చాలా కాల‌మే అయింది. త‌ర్వాత కాలంలో ఆయ‌న జైలు నుంచే తీవ్ర వివాదాస్ప‌ద అంశాల‌ను లేవ‌నెత్తుతూ.. రాజ‌కీయంగా దుమారం రేపుతున్నారు. తాజాగా రుషికొండ ప్యాలెస్ వ్య‌వ‌హారంపైనా లేఖ సంధించాడు.