లోకేష్ బాగానే మాట్లాడాడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడిపై మంత్రి నారా లోకేష్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి శాసనసభలో ప్రసంగించిన నారా లోకేష్…అయ్యన్నపాత్రుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టం అని లోకేష్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పారు.

వైసీపీ పాలనలో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, ఇంటి ప్రహరీ కూడా కూలగొట్టి 23 కేసులు పెట్టినా అలుపెరగకుండా పోరాటం చేశారని ప్రశంసించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు ఉందని, టీడీపీ సీనియర్ నేతలలో ఆయనకు కూడా ఒకరిని చెప్పారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికై 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం అయ్యన్న సొంతమని అన్నారు.

గతంలో సభ హుందాగా జరిగేదని, కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సభా గౌరవం తగ్గేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. సభా సంప్రదాయాలు, సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులకు దిశా నిర్దేశం చేయాలని అయ్యన్నపాత్రుడును లోకేష్ కోరారు. అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో విశాఖలో ఎన్నో మంచి పనులు జరిగాయని, అభివృద్ధి జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, తనకు ఆయన ఎన్నోసార్లు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారని అన్నారు.

ఒకే పార్టీ, ప్రజలు అజెండాగా టిడిపి నమ్ముకుని 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో సభను గౌరవప్రదంగా అందరం కలిసి ముందుకు తీసుకువెళదామని లోకేష్ మిగతా సభ్యులకు పిలుపునిచ్చారు. ఇక ఈ శాసనసభలో ప్రతిపక్షం లేదని కాబట్టి స్వపక్షమే విపక్షంలా మారి ప్రజా సమస్యలపై సభ లోపల, సభ బయట చర్చించి పరిష్కరించేందుకు కృషి చేద్దామని సభ్యులకు పిలుపునిచ్చారు. తొలిసారిగా సభలో లోకేష్ మాట్లాడిన తీరు అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.