‘మనకు గుర్తింపు రావాలంటే సమర్దుడైన ఆటగాడితో పోటీపడాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పాను” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్యరంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామని రేవంత్ అన్నారు. అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.
దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది ఎన్‌టీఆర్ అని, కిలో బియ్యం రూ. 2కు, జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని రేవంత్ గుర్తు చేశారు. సినీ రంగాన్ని బాలకృష్ణ చూసుకుంటారని, ఆయన అల్లుళ్లు లోకేశ్, భరత్ రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని రేవంత్ చెప్పడం విశేషం. ఎన్టీఆర్ ఆలోచనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని, నిరుపేదలకు క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు వైద్యరంగంలో విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.