కేజ్రీవాల్‌కు వ‌చ్చింది.. మ‌రి క‌విత‌కు?

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం ఇక్క‌డ బీఆర్ఎస్ పార్టీ నేత‌లు సంబ‌రాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ వ‌స్తే బీఆర్ఎస్ లీడ‌ర్ల‌కు ఆనందం ఎందుకు అనుకుంటున్నారా? ఇదే కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు కూడా త్వ‌ర‌లోనే బెయిల్ వ‌స్తుంద‌నే ఆశ‌లే కార‌ణం. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో క‌విత‌ను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌తో సీబీఐ కూడా ఎంట‌ర‌వ‌డంతో క‌విత అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు.

మ‌రోవైపు అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో జైలుకెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న్ని తిరిగి జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈడీ హైకోర్టుకు వెళ్ల‌డంతో ఈ బెయిల్‌పై స్టే ప‌డింది. ఇదిలా ఉండ‌గా మ‌రోవైపు క‌విత ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారా? అని బీఆర్ఎస్ నేత‌లు ఎదురు చూస్తున్నారు.

నిరుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో ఢీలా ప‌డ్డ కేసీఆర్‌కు క‌విత అరెస్టు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్ల‌తో పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డింది. ఇప్ప‌టికే క‌విత అరెస్టుతో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు త‌న‌యుడికి ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని, ఎన్నికల ప్ర‌చారానికి వెళ్లాల‌ని ఇలా వివిధ కార‌ణాల‌తో క‌విత బెయిల్ కోరినా కోర్టు నిరాక‌రించింది. మ‌రి ఇప్పుడు సీబీఐ క‌స్ట‌డి ముగియ‌డంతో క‌విత‌కు కోర్టు బెయిల్ ఇస్తుందా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినా దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశ‌ముంది. మ‌రి క‌విత బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న‌ది చూడాలి.