ఏపీలో జగన్ పాలన సాగిన సమయంలో ఆయన అనుకూలంగా పనిచేశారని.. ఎవరిపై కేసులు పెట్టమం టే వారిపై కేసులు పెట్టి.. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని అరెస్టు చేశారని.. విమర్శలు ఎదుర్కొని.. బ్యాడ్ అయిపోయిన ముగ్గురు ‘జగన్ ఐపీఎస్’లకు సీఎం చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. వారిలో ఒక్కరికి మాత్రమే తిరిగి పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం.. మిగిలిన ఇద్దరిని మాత్రం పక్కన పెట్టింది. దీంతో జగన్ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్‌లు ఇప్పుడు హడలి పోతున్నారు.
ఎవరెవరు?
రాజేంద్రనాథ్ రెడ్డి: ఈయన నిన్న మొన్నటి వరకు రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వైపుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను తప్పించారు. అప్పటి నుంచి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్ హయాంలో విపక్షాలపై దాడులు జరుగుతున్నా.. ఆయన చూసీ చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకులను ఆయన డీజీపీ కార్యాలయంలోకి రాకుండా.. అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. కాగా..ఇప్పుడు ఆయనను ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
సునీల్ కుమార్: ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్(జగన్ హయాంలోనే నియమించారు) గా ఉన్న ఈయనను చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజుపై లాఠీలతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులను బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
రిషాంత్‌రెడ్డి: ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉన్నారు. గతంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రిషాంత్ రెడ్డి.. చంద్రబాబు జిల్లాలో పర్యటించినప్పుడు.. అంగళ్లలో జరిగిన ఘర్షణల సమయంలో టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయి కేసులు పెట్టారు. అదేసమయంలో చంద్రబాబుపైనా కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈయనను కూడా.. పోస్టింగ్ ఇవ్వకుండా.. చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates