ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమయంలో ఉన్నారు. మరో వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో సామాజిక పింఛన్లు.. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వ్యవహారం తేల్చాల్సి ఉంది. ఇటు వైపు పదువులు.. పీఠాల హడావుడి ఉండనే ఉంది. ఇక, పోలవరం.. అమరావతి ప్రాజెక్టులను వడివడిగా ముందుకు నడిపించాల్సి కూడా ఉంది. ఇంత బిజీ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలకు వెళ్తున్నారు. మరి ఇలాం ఎందుకు వెళ్తున్నారు? ఏంటి విషయం అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఇంత బిజీ టైంలో తన నియోజకవర్గంలో పర్యటించే బదులు.. ఆయా పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అలా చేయడం లేదు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అయితే.. ఇంత అర్జంటు పనులు పెట్టుకుని ఎందుకు ? అనేది ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం.. గత నెలలో జరిగిన ఎన్నికలకు ముందు.. చంద్రబాబు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే.. ఇక్కడికి వస్తానని.. ప్రజలందరినీ కలుస్తానని చెప్పారు. అంతేకాదు.. తొలి వారంలోనే సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ఇక, పార్టీ కార్యకర్తలకు , నాయకులకు కూడా ఇదే హామీ ఇచ్చారు. పార్టీలో కీలక పదవులను పంచిపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత కీలక సమయంలోనూ కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు బయలు దేరుతున్నారు.
- ఎన్నికల ముందు వరకు వైసీపీ బాధితులుగా ఉన్న టీడీపీ నేతలకు ఊరటకల్పిస్తారు.
- పార్టీ నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా భేటీ అవుతారు.
- వచ్చే ఆరు మాసాలకు సరిపడా భరోసా వారికి కల్పిస్తారు. ఎందుకంటే.. మళ్లీ సంక్రాంతి వరకు బాబు కుప్పానికి వెళ్లే అవకాశం లేదు.
- నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్ షో నిర్వహించనున్నారు. 9వ సారి కూడా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్నారు.