అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!

రాజ‌ధాని అమ‌రావ‌తిలో నూత‌న సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. తొలుత ఆయ‌న‌.. గ‌తంలో జ‌గ‌న్ అధి కారంలోకి వ‌స్తూ వ‌స్తూనే కూల్చేసిన ప్ర‌జావేదిక ప్రాంగ‌ణం నుంచి చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించారు. ఆసాంతం కూల్చేసిన శిధిలాల‌ను ప‌రిశీలించారు. వాటిని తాము అలానే ఉంచుతామ‌ని.. ఇక్క‌డ చుట్టూ.. కంచెను ఏర్పాటు చేసి.. ప్ర‌ద‌ర్శ‌న‌కు కూడా ఉంచుతామ‌ని చెప్పారు. ఒక విధ్వంస పాల‌న‌కు ఇది నిద‌ర్శ‌నంగా త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా చేస్తామ‌న్నారు.

అనంత‌రం.. రాజ‌ధానిలోకి వెళ్లారు. ఇక్క‌డ 2015లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తికి శంకు స్థాప‌న చేసిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. దేశంలోని వివిధ న‌దుల నుంచి సేక‌రించిన నీరు, పుణ్య స్థ‌లాల నుంచి తీసుకువ‌చ్చిన మట్టిని ఆయ‌న ద‌ర్శించి.. మోకాళ్ల‌పై ప్ర‌ణ‌మిల్లారు. త‌ర్వాత‌.. రాజ‌ధానిలో నవ న‌గ‌రాలుగా పేర్కొన్న ప్రాంతాల‌ను కూడా ప‌రిశీలించారు. న్యాయ‌మూర్తులు..ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించి.. 99 శాతం ప‌నులు పూర్తి చేసుకున్న భ‌వ‌నాల వ‌ద్ద‌కు వెళ్లి వాటిని కూడా ప‌రిశీలించారు.

త‌ర్వాత‌.. ఉద్దండ‌రాయుని పాలెంలో ప‌రిశీలించి.. అమ‌రావ‌తి క‌ట్ట‌డాల‌ను ప‌రిశీలించిన చంద్ర‌బాబు ఆయా భ‌వ‌నాలు దుస్థితిని చూసి జాలి ప‌డ్డారు. తాము గ‌త ఐదేళ్ల‌లో అధికారంలో ఉండి ఉంటే.. ఇప్పటికి రాజ‌ధానిప‌రుగులు పెట్టి ఉండేద‌న్నారు. రాజ‌ధాని కోసం వేసిన శిలా ఫ‌ల‌కాన్నిసంద‌ర్శించి చేతితో తడిమి చూసుకున్నారు. అదేవిధంగా ఐకానిక్ భ‌వ‌నాల స‌ముదాయం కోసం కేటాయించిన స్థ‌లాల‌ను కూడా.. చంద్ర‌బాబు ప‌రిశీలించారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి నారాయ‌ణ స‌హా ప‌లువురు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. కాగా, రాజ‌ధాని రైతులు చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జై చంద్ర‌బాబు.. జై అమ‌రావ‌తి నినాదాల‌తో రాజ‌ధాని ప్రాంతం హోరెత్తిపోయింది.