అన్నంత పని చేసిన ముద్రగడ

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది. కానీ ఈసారి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే ధ్యేయంగా పని చేసి బొక్క బోర్లా పడ్డారు.

పవన్ కళ్యాణ్‌ను ఓడించాలంటూ పిఠాపురం ప్రజలకు ఆయన ఇచ్చిన పిలుపు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల ముంగిట పవన్‌ను ఓడించకుంటే తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటానంటూ ఆయన చేసిన సవాల్‌తో అభాసుపాలైపోయారు. ఇదేం సవాల్ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు.

కట్ చేస్తే ఎన్నికల్లో పవన్ కళ్యాణే కాదు.. జనసేన అభ్యర్థులందరూ కూడా తిరుగులేని విజయం సాధించారు. దీంతో ముద్రగడ పరువు పోయింది. ఐతే రాజకీయ నాయకులు ఎన్నికల ముంగిట ఇలాంటి సవాళ్లు చేయడం.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోవడం మామూలే. కానీ ముద్రగడ మాత్రం తన సవాల్‌కు కట్టుబడ్డారు. తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి కొన్ని రోజుల కిందటే అధికార ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ప్రకియ అంతా పూర్తయి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.

ముద్రగడ పద్మనాభం పేరు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మారినట్లు ఇందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆయన్ని అందరూ ‘పద్మనాభరెడ్డి’గానే పిలవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి ఈ వార్తే హాట్ టాపిక్‌గా మారింది. పేరు మార్పు సవాల్ విషయంలో ముద్రగడ ఇంత పట్టుదలకు పోయారేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.