ఎన్నికల ఫలితంతో పాతాళానికి పడిపోయిన జగన్‌కు మున్ముందు మరింత గడ్డు కాలం తప్పదా? రాబోయే అయిదేళ్లు జగన్‌కు కష్టమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అటు కేసులు.. ఇటు పార్టీ మారే జంపింగ్ నేతలతో జగన్‌కు తలనొప్పి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని పార్టీని నడిపించడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అధికారం ఉంది కదా అని తానే రాజులా భావించిన జగన్.. తన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు దూరంగా ఉన్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ఓటమిని తట్టుకుని ఆయన ప్రజల్లోకి వెళ్లడం అంత సులువు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీలో ఉండేందుకు ఏ నేతలైనా మొగ్గు చూపుతారన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు పక్కచూపు చూస్తున్నారు. అలాంటిది జగన్‌ను అట్టిపెట్టుకునే ఉంటారనే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మర్యాద, గౌరవం లభిస్తుంది. మాట చెల్లుబాటు అవుతుంది. అందుకే నాయకులు పార్టీ మారడం పెద్ద విషయమేమీ కాదు. ఈ ఎన్నికల్లో జగన్‌కు 11 సీట్లే వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఈ బాటలోనే మరికొంత మంది వెళ్లే అవకాశముంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జగన్‌పై అక్రమాస్తులు,అవినీతి తదితర ఆరోపణలతో పదికి పైగానే కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్ని రోజులు సీఎంగా ఉండటంతో ఈ విచారణలో జగన్‌కు మినహాయింపు దక్కిందనే చెప్పాలి. ఇప్పుడిక జగన్ సీఎం కాదు. ఈ కేసుల విచారణలో ఆయన కచ్చితంగా పాల్గొనాల్సిందే. ఇవే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతిని బయటకు లాగే ప్రయత్నాల్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. దీంతో జగన్‌పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్లడం కూడా ఖాయమన్నట్లే పరిస్థితి కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates